అల్పపీడనం వాయుగుండంగా .. ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. చలి తీవ్రత పెరుగుతున్న నవంబర్ నెలలోనూ ఏపీని వాన వెంటాడుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు
రేపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

నవంబర్ 25వ తేదీన వాయుగుండంగా బలపడే అవకాశం
తూర్పు హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాల పైన నవంబర్ 25వ తేదీన వాయుగుండం గా బలపడేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు.
రైతులకు అలెర్ట్
దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక వర్షాలు కురిసేందుకు రెండు రోజుల సమయం ఉన్నందున ముఖ్యంగా రైతులు వరి కోతకు వచ్చిన సమయంలో ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు అన్నారు.
ఏపీలో వర్షాలపై ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ అలెర్ట్
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అది వాయువ్యదిశగా కదులుతూ ఆ తర్వాత రెండు రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే ఛాన్స్ ఉన్నదని రోణంకి కూర్మనాధ్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications