పోలవరంపై లోక్‌సభలో కేంద్రం ప్రకటన..జగన్ హయాంలోనే
AP Reorganisation Act 2024: విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటోన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విభజన చోటు చేసుకున్న 10 సంవత్సరాల తరువాత- దీనిపై లోక్‌సభలో సుదీర్ఘ సమాధానం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది కేంద్రం.
ఏపీ పునర్విభజన చట్టం ఆమోదం పొంది 10 సంవత్సరాలు దాటిన విషయం తెలిసిందే. ఆ చట్టంలోని 10, 11వ షెడ్యూళ్లల్లో పొందుపరిచిన అంశాలు పెద్దగా పరిష్కారానికి నోచుకోలేదు. 11వ షెడ్యూల్ పొందుపరిచినట్టుగా- రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల మార్గదర్శకాలతో పాటు నీటి పంపకాల సమస్యను కేంద్రం సామరస్యంగా పరిష్కరించాల్సి ఉంది.

ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్ట్, ఖమ్మం, కడప జిల్లాల్లో స్టీల్ ఫ్యాక్టరీల ఏర్పాటు వంటివీ ఇందులో ఉన్నాయి. 9వ షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించిన వివాదం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ప్రస్తుతం కీలకంగా మారింది. ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 6,500 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కావట్లేదు.
ఉమ్మడి ఆస్తుల్లో ఏపీ-తెలంగాణ వాటాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఉమ్మడి ఆస్తుల్లో ఏపీ-58, తెలంగాణ-42 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం ఇదివరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలపైనా ఇదివరకు పలు అనుమానాలు ఉండేవి. వాటన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది.
తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరు లోక్‌సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. పునర్విభజన చట్టాన్ని సమగ్రంగా అమలు చేస్తోన్నామని అన్నారు. ఇందులో పొందుపరిచిన అంశాల్లో కొన్ని అమలు అయ్యాయని, మరికొన్ని వేర్వేరు దశల్లో ఉన్నాయని చెప్పారు.
ఈ చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పొందుపరిచిన విద్యాసంస్థల విభజన పూర్తయిందని నిత్యానందరాయ్ తెలిపారు. మిగిలిన విద్యాసంస్థలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల విభజన వివిధ దశల్లో ఉందని అన్నారు. ఏపీ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు తాము సమీక్షలను నిర్వహిస్తోన్నామని, ఇప్పటివరకు 34 రివ్యూ మీటింగులు జరిగాయని పేర్కొన్నారు.
2023 అక్టోబర్ 19వ తేదీన పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి సంబంధించిన రివైజ్డ్ అంచనాలు జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు అందాయని నిత్యానంద రాయ్ చెప్పారు. తొలిదశ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 30,436.95 కోట్ల రూపాయలుగా రివైజ్డ్ కాస్ట్ కమిటీ నిర్ధారించిందని, డ్యామేజ్‌కు మరమ్మతులు చేయడానికి అవసరమైన 2,620.24 కోట్ల రూపాయలను ఇందులోనే చేర్చామని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ నిర్మాణ వ్యయం అంచనాలను 31,625.238 కోట్ల రూపాయలుగా నిర్ధారించడానికి అవసరమైన చర్యలను సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకుంటోందని నిత్యానంద రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే జల్ శక్తి శాఖకు అందుతాయని వివరించారు.












Click it and Unblock the Notifications