ఏపీలో భూములపై స్పెషల్ డ్రైవ్-కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం..!
ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో భూవివాదాల నేపథ్యంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రైవేటు భూములేవీ కూడా 22ఏలో ఉండకూడదనేదే ప్రభుత్వ ఆశయమని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు భూమి అనేది సెంటిమెంటుతో కూడుకున్న వ్యవహారమని, పేదలకైతే అది ఒక భరోసా, క్షేత్రస్థాయిలో ప్రజలు తమ భూములకు సంబంధించి వివాదాలు లేకుండా చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల కాలంలో రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు, ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని, ఆర్ ఓ ఆర్ చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు. ఆర్ ఓ ఆర్ చట్టాన్ని సవరించి అప్పీల్ అధికారాన్ని డీ ఆర్వో ల నుండి ఆర్డీవోలకు మార్చాం. దీంతో భూ యజమానులకు త్వరగా వారి అప్పీళ్లు పరిష్కారం అవుతాయన్నారు.

ప్రైవేటు భూములు ఎట్టిపరిస్థితిలోనూ 22ఏ వివాదాల్లో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఆశయమని రెవెన్యూ మంత్రి అనగాని తెలిపారు. చాలా మందికి తమ భూమి ఎందుకు 22ఏ వివాదంలో ఉందో కూడా తెలీదన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా జిల్లాల్లో భూ వివాదాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నాన్నారు. రెవెన్యూ శాఖలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, అర్జీలను అన్నిటిని పరిష్కరిస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను కూడా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.700 కోట్లు దుర్వినియోగం చేసి సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకుంటే ఇప్పుడు వాటిని తొలగిస్తున్నామన్న్నారు.
ఇదే క్రమంలో రాష్ట్రంలో వివాదరహిత భూములున్న పేదలకు వాటిని ్క్రమబద్దీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని మంత్రి అనగాని తెలిపారు. 22ఏ భూముల వివాదాల పరిష్కారంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటి కోసం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, దీనికి జిల్లా కలెక్టర్లు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం నిర్వహించిన రీ సర్వే తప్పుల తడకగా సాగిందని, రీ సర్వేపైన గ్రామ సభలు పెట్టామని గుర్తుచేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. వీటితోపాటు పిజిఆర్ఎస్ లోనూ ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిల్లో 90 శాతం పరిష్కరించామని తెలిపారు.

రోజుకు 20 ఎకరాల్లోనే రీసర్వే చేస్తున్నామని, కొత్తగా పాసుపుస్తకం జారీ చేయడంతో పాటు, దానికి జియోట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో పలు చోట్ల భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయని, ఇలాంటి కేసులు కూడా త్వరితగతిన పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ లాయర్లతో సమావేశమై ఆ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ప్రజలు తమ భూముల సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారుల వద్దకు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని, ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పగలిగేలా ఒక స్పీకింగ్ నోట్ ఇచ్చే పరిస్థితికి చేరుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications