ఏపీ సమాచార శాఖ డైరెక్టర్ గా ప్రఖర్ జైన్-కీలక బాధ్యతల్లోకి యువ ఐఏఎస్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిల్లా కలెక్టర్ల బదిలీలు, నియామకాల్లో సమాచార పౌరసంబంధాలశాఖ డైరెక్టర్ గా ఉన్న హిమాన్షు శుక్లాకు ప్రమోషన్ లభించింది. ఆయన్ను నెల్లూరు జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అప్పటివరకూ ఆయన బాధ్యతలు నిర్వర్తించిన సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ పదవి ఖాళీ అయింది. ఈ పదవికి పలువురు అధికారుల్ని పరిశీలించిన ప్రభుత్వం.. ఓ యువ ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ డైరెక్టర్ గా ప్రఖర్ జైన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు ప్రఖర్ జైన్ సచివాలయంలోని కీలకమైన ఆర్టీజీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఇవాళ ఆయన్ను సమాచార పౌరసంబంధాలశాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈయన 2021 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి.

దీంతో పాటు ప్రఖర్ జైన్ కు మరో బాధ్యత కూడా అప్పగించింది. ఏపీ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు ఎండీగా కూడా ప్రఖర్ జైన్ ను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆయన ఇప్పుడు రెండు కీలక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రఖర్ జైన్ ఈ రెండు బాధ్యతల్లోనూ కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాచారశాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై కూటమి సర్కార్ దర్యాప్తు జరుపుతోంది. అలాగే కమిషనర్ కు బదులు డైరెక్టర్ పదవికి అధికారుల్ని నియమిస్తోంది. ఇందులో భాగంగా తొలుత హిమాన్షు శుక్లాకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆయన స్ధానంలో మరో ఐఏఎస్ ప్రఖర్ జైన్ ను నియమించడం విశేషం.












Click it and Unblock the Notifications