రాష్ట్ర ఉద్యోగులతోనే ఎన్నికలు- ఏకగ్రీవాలకు తాయిలాలు పాతవే- అలజడిపై షాడో నిఘా-నిమ్మగడ్డ
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుతో అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికీ, ఎస్ఈసీకి మధ్య సమస్యగా మారిన ఏకగ్రీవ ఎన్నికలపై ఇవాళ మరోసారి స్పందించారు. ఏకగ్రీవ ఎన్నికలకు ప్రభుత్వం ఇవ్వజూపుతున్న తాయిలాలపైనా ఆయన తన అభిప్రాయం తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరిగితేనే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల అవుతాయని నిమ్మగడ్డ తెలిపారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల సమీక్ష అనంతరం నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

పంచాయతీ ఎన్నికల ఆవశ్యకత
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య ఉత్కంఠ భరిత పోరు కొనసాగుతున్న వేళ అనంతపురం జిల్లాలో పరిస్ధితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లి అధికారులతో సమావేశమైన నిమ్మగడ్డ రమేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికలు జరగాల్సిన అవసరాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేశారు. స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరిగితేనే పంచాయతీలకు నిధులు అందుతాయన్నారు. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. కాబట్టి ఎన్నికలకు ప్రతీ ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని నిమ్మగడ్డ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోనే ఎన్నికలు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఆరంభంలో కేంద్ర ఉద్యోగుల సాయం కోరిన నిమ్మగడ్డ రమేష్ ఇవాళ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోనే ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. రాష్టంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ఎన్నికలకు సహకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు.

జగన్ సర్కారుపై పరోక్ష వ్యాఖ్యలు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగే ఏకగ్రీవాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వీటిపైనా నిమ్మగడ్డ స్పందించారు. బలవంతపు ఏకగ్రీవాల విషయంలో రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తనకు ఫిర్యాదులు అందుతున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎదుటివారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ పరోక్షంగా జగన్ సర్కారును ఉద్దేశించి నిమ్మగడ్డ వ్యాఖ్యలు చేశారు.

ప్రోత్సాహకాలు చట్టంలో ఉన్నవేగా..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలపైనా నిమ్మగడ్డ స్పందించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు కొత్తవేమీ కాదన్నారు. ఇవి పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్నవే అని నిమ్మగడ్డ గుర్తుచేశారు.ప్రత్యేకంగా ఏకగ్రీవం చేయడానికి ఈ ఎన్నికల్లో ఏమీ లేదన్నారు. కొత్తగా అలజడి సృష్టించాలని చూసే వారిపై షాడో టీమ్‌లతో నిఘా పెడుతున్నట్లు నిమ్మగడ్డ వెల్లడించారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని నిమ్మగడ్డ ఓటర్లకు, అభ్యర్ధులకు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications