ఏపీలో పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్- 1.36 లక్షల పోలింగ్ కేంద్రాల ఖరారు..!
ఆంధ్రప్రదేశ్ లో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. వరుసగా పట్టణ స్దానిక సంస్ధలు, గ్రామ స్దానిక సంస్ధల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఓవైపు కోర్టు కేసులు, మరోవైపు స్దానికంగా చేయాల్సిన ఏర్పాట్లు.. ఇలా ఎన్నికల సంఘం పలు అంశాలపై కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా(AP SEC) కీలక అప్డేట్ ఇచ్చారు.
రాష్ట్రంలో ఈసారి నిర్వహించే గ్రామ స్దానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల్ని ఖరారు చేశారు. ఈసారి రాష్ట్రంలోని 13278 గ్రామ పంచాయతీల్లోని లక్షా 33 వేల 128 వార్డుల్లో లక్షా 36 వేల 326 పోలింగ్ కేంద్రాన్ని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటి వెనుక జరిగిన కసరత్తును వెల్లడిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ పునేఠా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో పలు వివరాలు ఉన్నాయి.

రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండో సాధారణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఖరారు, ప్రచురణ కోసం ఆగస్టు 12న సర్కులర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 23న ఎంపీడీవోలు వీటి వివరాలను ప్రచురించారని, అలాగే ఆగస్టు 26 కల్లా వీటిపై అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. ఇందులో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను ఆగస్టు 31న ప్రచురించినట్లు ఎస్ఈసీ తెలిపారు. దీంతో ఈ పోలింగ్ కేంద్రాల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు.














Click it and Unblock the Notifications