ఏపీ మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం- నేడు ఎస్‌ఈసీ ప్రకటన- ఆగిన చోట నుంచే మళ్లీ
ఏపీలో పంచాయతీ ఎన్నికలు మూడో దశకు చేరుకున్న నేపథ్యంలో ఆ తర్వాత నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలకు ఎస్‌ఈసీ రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఇవాళ షెడ్యూల్ ప్రకటనకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఇవాళ కుదరకపోతే రేపు షెడ్యూల్ ప్రకటన రానుంది. దీని ప్రకారం ఈ నెలాఖరులోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం గతంలో ఎక్కడైతే ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచే తిరిగి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీని వల్ల సమయం కలిసి రానుంది.

మున్సిపల్ పోరుకు రెడీ
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ప్రయత్నాలు వేగవంతం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం లేకపోవడంతో గతంలో ఆపిన చోటు నుంచే తిరిగి ప్రారంభించేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు రెండు దశలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో దశకు చేరిన నేపథ్యంలో తదుపరి దశలపై ఎస్ఈసీ దృష్టిపెట్టారు. ఈ నెల 21తో పంచాయతీ నాలుగు దశల ఎన్నికలు పూర్తవుతాయి. 22తో పూర్తి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. దీంతో ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ కానుంది.

మున్సిపల్ పోరు మొదలయ్యేది అక్కడి నుంచే
ఏపీలో గతేడాది మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్ధులు నామినేషన్లు కూడా వేశారు. ఆ తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో నామినేషన్ల ఉపసంహరణకు వీల్లేకుండా పోయింది. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే సరిపోతుంది. ఎలాగో నామినేషన్లు వేసిన అభ్యర్ధుల్లో కొన్ని అభ్యంతరాలు, భయాలు, ఇతరత్రా కారణాలతో ఉపసంహరణ తప్పదు. దీంతో ఉపసంహరణ నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇవ్వబోతున్నారు. దీనిపై రాజకీయపార్టీల్లో ఎలాంటి అభ్యంతరాలు కూడా లేకపోవడంతో ఎస్ఈసీకి మార్గం సుగమమవుతోంది.

మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఏం జరిగింది ?
గతేడాది విడుదలైన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి 22న 12 నగరపాలక సంస్ధలతో పాటు, 75 పురపాలకసంఘాలు, నగర పంచాయతీల్లో ఉన్న వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. అప్పటికే కార్పోరేషన్లలో రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి దాదాపు 6500 నామినేషన్లు దాఖలయ్యాయి.
అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 12 వేల మందికి పైగా నామినేషన్లు వేశారు.
Recommended Video

గతంలో పార్టీలు వేసిన నామినేషన్లు ఇవే...
గతంలో కార్పోరేషన్లకు వైసీపీ 2307 నామినేషన్లు వేయగా.. టీడీపీ 1675, జనసేన 386, బీజేపీ 345, కాంగ్రెస్ 290, సీపీఎం 146, సీపీఐ 88, బీఎస్పీ 33, ఎన్సీపీ 1, ఇతర పార్టీలు 62, స్వతంత్రులుగా 1230 నామినేషన్లు వేశారు. అలాగే మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వైసీపీ 5452, టీడీపీ 3610, బీజేపీ 554, జనసేన 434, కాంగ్రెస్ 168, సీపీఎం 110, సీపీఐ 104, బీఎస్పీ 27, ఎన్సీపీ 87, ఇతర పార్టీలు 122, స్వతంత్రులుగా 1418 మంది నామినేషన్లు వేశారు. దీంతో కార్పోరేషన్లలో మొత్తం 6563 నామినేషన్లు దాఖలు కాగా.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 12086 నామినేషన్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications