పిలల్ని స్కూళ్లలో చేర్చేందుకు జగన్ సర్కార్ భారీ డ్రైవ్-సచివాలయాలు, వాలంటీర్ల సాయంతో..
ఏపీలో అక్షరాస్యత శాతం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, గోరుముద్ద వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయినా కొత్తగా ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్ధుల శాతం తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ సేవల కోసం ఏర్పాటు చేసిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా పిల్లల నమోదు శాతం పెంచాలని భావిస్తోంది.
విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్) పెంచేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్లకు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. గ్రామ,వార్డు సచివాలయాల సేవలను వినియోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్)పై దృష్టి సారించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాల మధ్య పోటీని సృష్టించి తద్వారా ఆయా సచివాలయాల పరిధిలో 100% జీఈఆర్ సాధించి తమను తాము గర్వంగా ప్రకటించుకునేలా ఆ వ్యవస్థలను ప్రోత్సహించాలని ప్రవీణ్ సూచించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో 1 సెప్టెంబర్, 2005 నుండి 31 ఆగస్టు, 2018 మధ్య జన్మించిన ప్రతి బిడ్డ 1 నుండి 12వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా పాఠశాల, కళాశాలల్లో చేరకుండా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని ప్రవీణ్ ప్రకాష్ అధికారులను ఆదేశించారు.
పిల్లల వారీగా ట్రాకింగ్, 100 శాతం జీఈఆర్ సాధించిన సచివాలయాల సంఖ్యపై పర్యవేక్షణ ద్వారా చేరికల నిష్పత్తిని రెండంచెల ప్రక్రియలలో సమీక్షించాలన్నారు. జీఈఆర్ సాధించే క్రమంలో వాలంటీర్లకు అవసరమైన శిక్షణ అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి సచివాలయ పరిధిలోని వాలంటీర్ తమకు కేటాయించిన 50 గృహాల పరిధిలోని ఇళ్లను సందర్శించి 1 సెప్టెంబర్, 2005 నుండి 31 ఆగస్టు, 2018 మధ్య జన్మించిన పిల్లల వివరాలు సేకరించడం, 18-23 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కాలేజీలో చేరేలా చర్యలు చేపట్టడం ద్వారా 100 శాతం జీఈఆర్ సాధించేందుకు కృషి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications