AP SSC results 2023 : పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
ఏపీలో ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈసారి కూడా అభ్యర్ధులు ఫలితాలు చూసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన వివరాలు ఓసారి పరిశీలిద్దాం..
ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాలను చూసుకునేందుకు వెబ్ సైట్ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం పదో తరగతి పరీక్షా ఫలితాలు www.results.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచుతారు.

అలాగే పలు ప్రైవేట్ వెబ్ సైట్లు కూడా ఫలితాలను అందించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ఎక్కడైనా ఫలితాలను చూసుకునే అవకాశం కల్పించారు. ఈ వెబ్ సైట్లలో అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అయితే ఫలితాలు 11 గంటలకే విడుదలవుతున్నా అవి అప్ లోడ్ అయ్యేందుకు కాస్త సమయం పట్టే అవకాశముంది.
ఏపీలో ఈ ఏడాది 3349 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 6.65 లక్షలకు పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది. పరీక్షలు రాసిన వారిలో బాలురు 3,11,329 కాగా.. బాలికలు 2,97,741 మంది ఉన్నారు. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు 53,410 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరితోపాటు ప్రైవేటు విద్యార్థులు 1524 మంది, ప్రైవేటు సప్లిమెంటరీ విద్యార్థులు 147 మంది కూడా పరీక్షలు రాశారు.
గతేడాది ప్రశ్నాపత్రాల లీకేజీల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించింది. గత నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరిగాయి. ఈసారి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకూ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టింది. అది కూడా పూర్తి కావడంతో ఇప్పుడు ఫలితాలను విడుదల చేసింది.
ఈసారి రికార్డు స్ధాయిలో కేవలం 18 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. 72.26 శాతం విద్యార్ధులు ఈసారి ఉత్తీర్ణులయ్యారని, 69.27 శాతం బాలురు, 75.38 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. మొత్తం 933 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బొత్స తెలిపారు. 38 స్కూళ్లలో 0 శాతం నమోదైంది. పార్వతీపరం మన్యం జిల్లా 87 శాతం ఫలితాలతో అగ్రస్ధానంలో నిలవగా.. 60.39 శాతంతో నంద్యాల జిల్లా చివరి స్ధానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం ఫలితాలు నమోదయ్యాయి.
పరీక్షలు తప్పిన 27.74 శాతం విద్యార్ధుల కోసం జూన్ 2 నుంచి 10 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మే 17 తేదీలోగా సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే మే 27వ తేదీ వరకూ లేట్ ఫీజుతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈసారి పదో తరగతి పరీక్ష తప్పిన వారికి ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు.
ఈసారి పరీక్ష పాసైన వారు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. గతేడాదితో పోలిస్తే పదో తరగతి పరీక్షల్లో ఐదుశాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. అలాగే జీరో ఫలితాల సంఖ్య కూడా దాదాపు సగానికి తగ్గిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. పాసైన వారిలో ఇంగ్లీష్ మీడియం 80.8 శాతం మంది పాసైనట్లు మంత్రి వెల్లడించారు. తెలుగు మీడియంలో పాసైన వారి సంఖ్య కంటే ఇది అధికమన్నారు.












Click it and Unblock the Notifications