AP schools bandh : రేపు ఏపీలో స్కూళ్లు, కాలేజీల బంద్ - కారణం ఇదే..
ఏపీలో రేపు అన్ని విద్యాసంస్ధలు మూతపడబోతున్నాయి. రాష్ట్రంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్ధి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ జరగబోతోంది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసేయాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిరక్షణకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంఘాలు ప్రకటించాయి.

రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి నవంబర్ 8కి వెయ్యి రోజులు పూర్తవుతాయని బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్ధి సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా అన్ని యువజన, విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్ధలు మూసివేసి తమ ఆందోళనకు మద్దతు నివ్వాలని కోరుతున్నాయి.
ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికసంఘాలు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నాయి. అయినా కేంద్రం చాపకింద నీరులా ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వాల నుంచి సహకారం లేకపోవడం, ప్రైవేటీకరణ ఆగేలా లేకపోవడంతో ఎన్నికలకు ముందు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు వామపక్ష విద్యార్ధి సంఘాలు ఈ బంద్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంలోనూ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తామే స్వయంగా చేపడతామని ప్రకటించినా అడుగులు ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు రేపు స్కూళ్లు, కాలేజీల బంద్ కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications