చంద్రబాబు ఎన్నిరోజుల్లో సీఎం కాబోతున్నారో చెప్పేసిన అచ్చెన్నాయుడు..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అలాగే ప్రత్యర్ధులపై మాటల యుద్ధానికి కూడా దిగుతున్నాయి. అదే సమయంలో తమ సొంత పార్టీలపై నేతలు తమ అంచనాల్ని కూడా బహిర్గతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ ఎన్ని రోజుల్లో అధికారంలోకి వస్తుందో చెప్పేశారు. ఎన్ని రోజుల్లో చంద్రబాబు సీఎం కాబోతున్నారనే దానిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ నిర్వహించిన టీడీపీ మహాశక్తి చైతన్య రథయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహానాడు సాక్షిగా చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్ గ్యారెంటీని ప్రకటించారని, ఇందులో అతి ముఖ్యమైనది, సమాజంలో సగభాగమున్న ఆడపడుచుల గురించి మహాశక్తి పథకాన్ని ప్రకటించారన్నారు. ఆ పథకాన్ని ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి, మహిళకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఇవాళ మహాశక్తి చైతన్య రథయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించే వరకూ మహిళలు వంట ఇంటికే పరిమితం అయ్యారని అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే మహిళలకు గౌరవం, గుర్తింపు, ఆస్థిలో హక్కులు వచ్చాయన్నారు. తరువాత చంద్రబాబు 1995లో ఉమ్మడి ఏపీకి సీఎం అయిన తరువాత మహిళలను ఒక ఉద్యమం రూపంలో తెచ్చి ఛైతన్య పరిచారన్నారు. ఇవాళ మహిళలు ఇంత అభివృద్ధి చెందుతున్నారంటే కారణం టీడీపీనే అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు తెచ్చిన పథకాల్ని గ్రామగ్రామానా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత మాటమార్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జగన్ రెడ్డి దగా బటన్ నొక్కుతున్నారని, ఏ ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు పడటం లేదన్నారు. మరో 160 రోజుల్లో చంద్రబాబు సీఎం అవుతారని అచ్చెన్న జోస్యం చెప్పారు. ఇందుకోసం 50 రోజుల పాటు మహాశక్తి పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications