జనం గెలిపిస్తామంటున్నా- మేమే పనిచేయట్లేదు ! అచ్చెన్నాయుడు మరో షాకింగ్...
ఏపీలో ఎన్నికలకు సమీపిస్తున్న వేళ రాజకీయాలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న విపక్షాలు రోజుకో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ తాజాగా ముందస్తుగా మినీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో టీడీపీ పనైపోయిందంటూ గతంలో తిరుపతి ఎంపీ ఉపఎన్నికల సందర్భంగా ఓసారి షాకింగ్ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన అచ్చెన్నాయుడు.. ఇవాళ మరోసారి ఆ స్ధాయిలో కాకపోయినా తన పనితీరుతో పాటు పార్టీ నేతల పనితీరుపై విమర్శలు చేశారు. తనతో సహా పార్టీ నేతలెవరూ పూర్తి స్ధాయిలో పనిచేయడం లేదంటూ అచ్చెన్న షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అధికారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా తాము మాత్రం పూర్తిస్దాయిలో పనిచేయట్లేదని చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా చేపట్టిన బస్సు యాత్రల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ తనతో సహా నేతలు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే ఫీలింగ్ ఉందని అచ్చెన్నాయుడు నిర్వేదం వ్యక్తంచేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల్నేలో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతల్ని ఆయన కోరారు.

దసరాకు టీడీపీ పూర్తి మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని, అందులో ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలు ఉంటాయని అచ్చెన్న హింట్ ఇచ్చారు. అలాగే సీఎం జగన్ అప్పులు తెచ్చి అరకొర సంక్షేమం అందిస్తున్నారని, కానీ చంద్రబాబు భవిష్యత్తులో సంపద సృష్టించి పూర్తిస్దాయిలో సంక్షేమాన్ని అమలు చేస్తారని అచ్చెన్న వెల్లడించారు. ప్రచార కార్యక్రమాల్ని నేతలు సీరియస్ గా తీసుకోవాలని, చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్దితి తెచ్చుకోవద్దని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications