నిజాంలా కూడా, రెచ్చగొట్టొద్దు: కేసీఆర్‌పై ఏపీ టీడీపీ ఫైర్
హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయమై తెలంగాణ ప్రభుత్వం తండ్రి స్థానికతను 1956కు ముందు తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు నిజాం నవాబ్‌కు ఉన్న ఔదార్యం కూడా లేదన్నారు. దేశంలో ఎక్కడైనా స్థానికత వివక్ష ఉందా అని ప్రశ్నించారు.
రీయింబర్సుమెంట్స్ పైన కేసీఆర్ తీరు అత్యంత వివాదాస్పదమన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇవ్వనని చెప్పిన వారు రేపు ఉద్యోగాలు కూడా ఇవ్వనని చెబుతారని విమర్శించారు. భద్రాచలం వారు తెలంగాణవాసులు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు ఇలాగే ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో స్థానికులు కాని వారు ఏ రాష్ట్రానికి చెందిన వారని ప్రశ్నించారు. కేంద్రం స్పందించాలన్నారు.

గంటా ధ్వజం
ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత అంశంపై రాజ్యాంగ సంక్షోభం సృష్టించొద్దన్నారు. ఈ విషయంలో స్థానికులు, స్థానికేతరులుగా చూస్తూ ఇంకా ఆయన ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. తెలంగాణ ఏమి వాటికన్ సిటీ కాదన్నారు.
లక్షకోట్లతో రాజధాని నిర్మించుకుంటామన్న వారు బోధనా రుసుం చెల్లించుకోలేరా అని అడగటానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. లక్షకోట్లతో కాకపోతే ఐదు లక్షల కోట్లతో రాజధాని నిర్మించుకుంటామన్నారు. ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలా మాట్లాడుతున్నారన్నారు. రేపే ఢిల్లీ వెళ్లి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిని కలసి పరిస్థితిని వివరిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్ పై రాజకీయం చేయడం తగదని, కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని రావెల కిషోర్ బాబు
రాజ్యాంగం ప్రకారమే ఏ ప్రభుత్వాలు అయినా నడుచుకోవాలని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్‌లో స్థానికత అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications