ఏపీలో టీచర్స్ డే బాయ్ కాట్-అధ్యాపకుల కీలక నిర్ణయం-సన్మాన సత్కారాలు బహిష్కరణ
అమరావతి : ఏపీలో ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరపరాదని ఉపాధ్యాయసంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వ తీరుకు నిరనసగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ సంఘాలు కొంతకాలంగా తమ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. పలవు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఫేస్ యాప్ , బయోమెట్రిక్ హాజరుతో పాటు పలు నిర్ణయాలతో వారిని టార్గెట్ చేస్తున్నట్లు భావిస్తున్నాయి. తాజాగా విజయవాడలో చేపట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమానికి వారు హాజరవుతారనే భయాలతో ముందస్తు అరెస్టులు, బైండోవర్లకు కూడా దిగింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ ప్రకటించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 5న ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలు తిరస్కరణకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానిస్తోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ లో సంఘాలు పేర్కొన్నాయి. అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరిగణిస్తున్నామని, సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్యలకు నిరసనగానే టీచర్స్ డే బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.












Click it and Unblock the Notifications