ఏపీలో టీచర్ల బదిలీలకు ముహుర్తం ఖరారు ! షెడ్యూల్ ఇలా..!
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇకపై ప్రతీ ఏటా ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని విద్యామంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనకు అనుగుణంగా త్వరలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించి తేదీలు కూడా ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు బదిలీలు ఎలా జరుగుతాయన్న దానిపైనా వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి.
రాష్ట్రంలో ఈసారి మే 7వ తేదీన ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మే 15 వరకూ అప్లికేషన్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అనంతరం మే 18 నుంచి 20వ తేదీ వరకూ ఎంఈవోల లాగిన్ లో సవరణలకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత మే 21 నుంచి 22 వరకూ డీఈవోల లాగిన్ లో వీటి సవరణకు అవకాశం ఉంటుంది. అనంతరం మే 29న ఉపాధ్యాయుల వ్యక్తిగత మొబైల్స్ కు బదిలీల వివరాలు పంపిస్తారు. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు బదిలీ కావాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇప్ప టికే ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించబోతున్నారు. ఆదర్శ ప్రాధమిక పాఠశాల విధానంకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి అయిదో తరగతులకు అయిదు గురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తారు. ఇప్పటికే ఈ కేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. అదే విధంగా వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి పూర్తి కానుంది.












Click it and Unblock the Notifications