ఏపీ-తెలంగాణ జల వివాదం: రంగంలోకి దిగిన ఏపీ బీజేపీ: ఇక తాడోపేడో: ఎల్లుండి కర్నూలులో
కర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య మరోసారి తలెత్తిన జల వివాదాలు మరింత ముదురుతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోన్నాయి. ఈ ఉద్రిక్త వాతావరణం వల్ల నాగార్జున సాగర్ వద్ద రెండు వైపులా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ దూకుడును అడ్డుకోవాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్రానికి లేఖ రాయాల్సిన పరిస్థితిని కల్పించింది. ప్రాజెక్టుల వద్ద కేంద్రీయ బలగాలతో భద్రతను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌కు లేఖ రాశారు.
ఈ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు దృష్టి సారించారు. జల వివాదాలను పరిష్కరించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సన్నద్ధమౌతోన్నారు. ఇందులో భాగంగా- ఆదివారం కర్నూలులో సమావేశం కానున్నారు. నాలుగు రాయలసీమ జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు ఇందులో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ భేటీకి నేతృత్వాన్ని వహించనున్నారు.

ఏపీకి సంబంధించిన నీటి పంపకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై భవిష్యత్‌లో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందనే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే- ఏపీ ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు, సలహాలతో కూడిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తారని తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయంపై బీజేపీ నేతలు చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్ల రాయలసీమకు ఎదురవుతోన్న ఇబ్బందులు, నీటి పంపకాలు, జల వనరుల ప్రాజెక్టులపై చేస్తోన్న వివాదాల మీద విస్తృతంగా చర్చిస్తామని బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ఈ భేటీలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాస్థాయి అధ్యక్షులు పాల్గొంటారని, తమ అభిప్రాయాలను తెలియజేస్తారని చెప్పారు. ఈ వివాదాలను సామరస్యపూరకంగా, శాంతియుత వాతావరణంలో ఎలా పరిష్కరించుకోవాలనే విషయానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నిపుణులతో సంప్రదించి- ఈ వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications