ఆ ఒక్క కండిషన్ తీసేయండి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బదిలీలు, పోస్టింగ్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం బదిలీల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సచివాలయాల హేతుబద్ధీకరణ, ఉద్యోగుల వర్గీకరణ తర్వాత ప్రభుత్వం బదిలీలకు పెట్టిన ఓ కండిషన్ ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆ ఒక్క రూల్ తీసేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గరి నుంచీ ప్రభుత్వం ఉద్యోగులను బదిలీలు చేయకుండా వారికి పోస్టింగ్ ఇచ్చిన చోటే పనిచేసుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా చేపడుతున్న బదిలీల్లో మాత్రం వారిని సొంత మండలాల్లో, సొంత మున్సిపాలిటీల్లో కాకుండా మరో చోటికి తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనిపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ చాలీ చాలని జీతాలున్నా సొంత ఊర్లలోనే పనిచేసుకుంటున్నామని, ఇప్పుడు వేరే ఊర్లలకు బదిలీ చేస్తే అక్కడ ఖర్చు తడిసి మోపెడవుతుందని వారు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో నేటివ్ మండలం,నేటివ్ మున్సిపాలిటీలోనే బదిలీలు కల్పించాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సమాఖ్య సచివాలయాల శాఖ మంత్రి డీబీవీ స్వామికి వినతిపత్రం ఇచ్చింది. సచివాలయంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందించి వెంటనే మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళాలని కోరింది దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే ఫోన్ ద్వారా మంత్రికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే,విధుల్లో చేరిన నాటి నుండి న్యాయంగా రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సైతం వెంటనే మంజూరు చేయాలని కోరుతూ మరో వినతిపత్రం కూడా ఇచ్చారు.












Click it and Unblock the Notifications