AP Volunteers: ఏపీ వాలంటీర్లకు జగన్ సర్కార్ సంక్రాంతి కానుక రెడీ..!
ఏపీలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం సంక్రాంతి వేళ శుభవార్త చెప్పింది. ఇప్పటికే తమకు ఇస్తున్న గౌరవ వేతనం 5 వేలు సరిపోవడం లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్న వాలంటీర్లకు రేషన్ పంపిణీ కారణంతో రూ.750 పెంచి ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో అంశంలో క్యాష్ రివార్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో మెరుగ్గా విధులు నిర్వర్తించే వాలంటీర్లకు దీని ప్రయోజనం లభించబోతోంది.

ఏపీలో విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతీ ఏటా ఉగాది సమయంలో సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో పాటు క్యాష్ రివార్డులు కూడా ఇస్తోంది. అయితే వీటికి అదనంగా మరో క్యాష్ రివార్డు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రేషన్ పంపిణీ చేస్తున్నారనే కారణంతో ఎలా అయితే అదనంగా ఇన్సెంటివ్ తరహాలో 750 మొత్తం ఇస్తున్నారో అలాగే ఇప్పుడు మరో అంశంలో ఈ క్యాష్ రివార్డు అందిస్తారు. అయితే గంపగుత్తగా కాకుండా ఆయా అంశంలో మెరుగైన పనితీరు ఆధారంగా ఎంపిక చేసి ఇస్తారు.
వాలంటీర్లకు అభినందన 2024 పేరుతో ఈ తాజా కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పెన్షన్, ఆసరా, చేయూత పథకాల అమలులో మెరుగైన పనితీరు చూపిన వాలంటీర్లను ఎంపిక చేయబోతున్నారు. వీరిని మండలం, పట్టణం, జోనల్ నియోజకవర్గం, జిల్లాల స్ధాయిలో ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లా స్ధాయి కమిటీలను నియమించింది. ఈ కమిటీలు వీరిని ఎంపిక చేస్తాయి.
ఫిబ్రవరి మూడో వారంలో ఈ వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఇందులో మండల, పట్టణ, జోనల్ స్ధాయిలో ఎంపికైన వాలంటీర్లకు రూ.15 వేలు చొప్పున ఇవ్వబోతున్నారు. అలాగే నియోజకవర్గ స్ధాయిలో ఎంపికైతే రూ.20 వేలు, జిల్లా స్ధాయిలో ఎంపికైతే రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందచేస్తారు. దీంతో గౌరవ వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం మరో రూపంలో ప్రయోజనం కల్పించినట్లవుతోంది.












Click it and Unblock the Notifications