AP Weather: మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో 4 రోజులు వర్ష సూచన..!
అర్నాబ్ తుఫాన్ నుంచి ఏపీ ఇంకా బయటపడనే లేదు. మరో అల్పపీడనం ప్రభావం చూపించేందుకు సిద్దమవుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై తాజాగా అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న నికోబార్ దీవులపై స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.. శనివారానికి ిది ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అలర్ట్ (AP Weather Alert) జారీ చేసింది.
వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం అల్లూరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం విజయనగరం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా కురిసే అవకాశం ఉంది.
ఆదివారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం రోజు అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం పోలవరం జిల్లాలో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే కాలువలు, వాగులు దాటే ప్రయత్నం , నది ఈతకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
