నేతన్న భరోసాకు అప్లై చేసిన వారికి కీలక వెసులుబాటు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు మరో ముఖ్యమైన ఉపశమనం కల్పించింది.ఇప్పటికే నేతన్న భరోసా ద్వారా నేత కార్మికులకు ఆర్ధిక భరోసాగా నెలకు 4వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్న ఏపీ సర్కార్ తాజాగా నేతన్న భరోసా పథకం కింద పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులకు ఒక పెద్ద ఉపశమనం కలిగించే వార్త చెప్పింది.
నేతన్నభరోసా కోసం దరఖాస్తు చేసుకునే నేత కార్మికులు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ అందజేయాల్సిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు అందజేస్తే సరిపోతుందని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 16 వరకు నూతన పెన్షన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు నేత కార్మికులకు ఉపయుక్తంగా మారింది.

బ్యాంకు స్టేట్‌మెంట్ నిబంధన చేనేత కార్మికులకు పెద్ద అడ్డంకిగా మారిన క్రమంలో మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చాలా మందికి వ్యక్తిగతంగా వేతనాలు చెల్లిస్తుండటం వల్ల బ్యాంకు స్టేట్‌మెంట్ సమకూర్చుకోవడం కష్టంగా మారింది. ఈ సమస్యను చేనేత సంఘాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా. మంత్రి సవిత వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో నిబంధనను సడలించాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్‌లు అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులకు బ్యాంకు స్టేట్‌మెంట్‌లు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మందికి పైగా నేతన్నలకు నెలకు రూ.4 వేలు చొప్పున పెన్షన్ అందజేస్తున్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు నేతన్నల సేవలో పథకం కింద ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది చేనేతలకు పెన్షన్ పొందే అవకాశం మరింత సులభతరం కానుంది.













Click it and Unblock the Notifications
