స్వర్ణాంధ్రప్రదేశ్.. బంగారంతో మెరుస్తుంది.. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారం గని ఏపీలో త్వరలో..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే బంగారాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా గుర్తింపు సాధించనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిద్ధం అవుతుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.
దేశంలో తొలి ప్రైవేట్ బంగారం గని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరానికి బంగారు ఉత్పత్తి మొదలుకానున్నట్లు సమాచారం. ఈ బంగారు గనిలో ఉత్పత్తి ప్రారంభమైతే మనదేశంలో ప్రైవేటు రంగంలో మొదలైన తొలి బంగారం గని ఇదే కావడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

ప్రయోగాత్మక కార్యాకలాపాలు మొదలెట్టిన సంస్థ
సుమారు 250 ఎకరాల భూసేకరణ చేపట్టి భూగర్భం నుండి పసిడి వెలికి తీయడానికి 200 కోట్లు పెట్టుబడితో దక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ అనే కంపెనీ అనుబంధ సంస్థ అయిన జమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ జొన్నగిరి బంగారం గనిని అభివృద్ధి చేస్తుంది . ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టిన సంస్థ ప్రయోగాత్మక కార్యకలాపాలను ఇప్పటికే మొదలుపెట్టింది.
ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం
ఇక ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60 శాతం పూర్తయినట్టుగా సమాచారం. ఈ ప్లాంట్ లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో జరిగితే ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని సంస్థ అంచనా వేస్తుంది. ఇప్పటివరకు ఈ గని పైన రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్టు దక్కన్ గోల్డ్ మైన్స్ ఇప్పటికే వెల్లడించింది.
జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు
జొన్నగిరితో పాటు, ఏపీలో ఇతర ప్రాంతాలలో ఉన్న బంగారు గనులను అభివృద్ధి చేసినట్లయితే జాతీయ స్థాయిలో బంగారు గనుల రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని చిగర్ గుంట, బిసనత్తమ్ బంగారం గనిలో 18 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉన్నట్లు ఎన్ఎండిసి అంచనా వేసింది. ఒక్కో టన్ను ఖనిజం నుంచి ఐదు గ్రామాలకు పైగానే బంగారం లభిస్తుందని ఎన్ఎండిసి లిమిటెడ్ భావిస్తుంది.
దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దక్కన్ గోల్డ్ మైన్ సంస్థకు గనులు
ఏపీలో ఉన్న బంగారం వెలికితీస్తే ఏపీ నిజంగానే స్వర్ణాంధ్ర ప్రదేశ్ అవుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దక్కన్ గోల్డ్ మైన్ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గనులు ఉన్నాయి. ఆఫ్రికాలోని మోజాంబిక్ లో లిథియం గనులను కూడా ఈ సంస్థ తాజాగా కొనుగోలు చేసింది. రోజుకు వంద టన్నుల లిథియం తోపాటు ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు భారీ ప్లాంట్ ను నిర్మిస్తుంది. దీనికి సదరు సంస్థ అక్కడ స్థానికంగా ఉన్న మరొక కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications