పవన్ కల్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు..!!
ఏపీలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్నారని ఆరోపించారు. వీరి అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉన్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల పైన ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రులు పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఇదే సమయంలో ఏపీ మహిళా కమిషన్ తాజాగా పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. వివరణ కోరింది.
పవన్ వ్యాఖ్యల కలకలం: పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో సంచలన కామెంట్స్ చేసారు. ఏపీలో మహిళలు అదృశ్యం అవుతున్నారని ఆరోపించారు భీమవరం లో అదృశ్యం అవుతున్నారంటూ లెక్కలు చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏలూరులోనూ అదే అంశం ప్రస్తావించారు. అదృశ్యమైన 30 వేల మందిలో 14వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని ఆరోపించారు.

ప్రతీ గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు..వారిలో మహిళలు ఎందరు..వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారని...ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని పవన్ తీవ్ర ఆరోపణలు చేసారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మంత్రులు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు: ప్రభుత్వంలోని మంత్రులతో పాటుగా వాలంటీర్లు పవన్ వ్యాఖ్యల పైన సీరియస్ అయ్యారు. పవన్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని మంత్రులు ఆరోపించారు. పవన్ కు ఏ అంశం పైనా అవగాహన లేదని మండిపడుతున్నారు. ఇదే సమయంలో మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యల పైన వాలంటీర్లు ఫిర్యాదు చేసారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పవన్ వ్యాఖ్యలను నిరిసిస్తూ ఆందోళన చేసారు. దీని పైన మహిళా కమిషన్ స్పందించింది. పవన్ కు నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్ పై ఆరోపణలు చేస్తున్న పవన్ పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యల పైన వివరణ కోరింది.
మహిళా కమిషన్ నోటీసులు: తమ పైన పవన్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలకు దిగారు. పవన్ దిష్టి బొమ్మలను దగ్గం చేసారు. పవన్ వెంటనే తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేసారు. ఏ కేంద్ర ఇంటలిజెన్స్ మీకు సమాచారం ఇచ్చిందో...ఏ చెప్పిందో వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
పవన్ చెప్పిన మిస్సింగ్ లెక్కల పైన పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే మహిళలకు క్షమాపణ చెప్పాలని తేల్చి చెప్పారు. ఏ కేంద్ర ఇంటలిజెన్స్ పవన్ కు చెప్పిందో ఏపీకి సమాధానం కావాలని పద్మ పేర్కొన్నారు. పవన్ సమాధానం ఇవ్వకుంటే వెంటాడుతామని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications