మంత్రి రంగనాధ రాజు రాజీనామా తప్పదా..!! ఆ ఎమ్మెల్యేల పైనా-సడన్ గా : సీఎం జగన్ కఠినంగానే- ఎందుకంటే...!!
ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాలు పూర్తి వెల్లడయ్యాయి. ఇందులో అధికార వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. తుది ఫలితాలను చూస్తే..రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 5998 చోట్ల వైకాపా, 826 చోట్ల తెదేపా, 177 చోట్ల జనసేన, 28 చోట్ల భాజపా, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 502 చోట్ల వైకాపా, 6 చోట్ల తెదేపా, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో చోట గెలుపొందారు.

వైసీపీ ఏకపక్ష విజయం తో జోష్
అయితే, టీడీపీ తాము ఎన్నికలను బహిష్కరించామని..అందుకే వైసీపీ అన్ని స్థానాల్లో గెలిచిందని చెబుతోంది. కానీ, వైసీపీ మాత్రం నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత టీడీపీ తమ నిర్ణయం ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ ఎన్నికలను బహిష్కరించి ఉంటే బ్యాలెట్ పేపర్ల మీద టీడీపీ అభ్యర్దులు..అదే విధండా 6 జెడ్పీటీసీలత తో పాటుగా 826 ఎంపీటీసీలను ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఫలితాలు వైసీపీలో జోష్ పెంచితే..ఒక మంత్రి...ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం టెన్షన్ లో ఉన్నారు.

నాటి హెచ్చరికలు నేడు అమలవుతాయా
స్థానిక సంస్థల ముందు సీఎం జగన్ ఈ ఎన్నికలను మంత్రులు..ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవాలని ...ఎవరి నియోజకవర్గాల్లో అయినా పార్టీ ఓడితే దానికి బాధ్యత వారిదనేని స్పష్టం చేసినట్లుగా పార్టీలో ప్రచారం సాగింది. అదే విధంగా గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో జెడ్పీటీసీలు ఓడినందుకు ఆ ప్రాంతాల్లో మంత్రులుగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాగంటి బాబు.. కర్నూలు జిల్లా నుంచి మారప్ప ను కేబినెట్ నుంచి తప్పించారు. అదే విధంగా జెడ్పీటీసీలు ఓడితే జగన్ కేబినెట్ లోని మంత్రులకు అదే వర్తిస్తుందనే ప్రచారం సాగింది.

రంగనాధ రాజుతో పాటుగాగా ఎమ్మెల్యేల్లో టెన్షన్
ఈ క్రమంలో ఇప్పుడు 6 చోట్ల తెదేపా, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో చోట జెడ్పీటీసీలను గెలుపొందారు. అందులో ప్రధానంగా మంత్రి రంగనాధ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట స్థానం ఉంది. అక్కడ వైసీపీ అభ్యర్ధి కడలి గోవిందరాజు పైన టీడీపీ అభ్యర్ధి ఉప్పలపాటి సురేష్ బాబు 2,253 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఇక్కడ టీడీపీ - జనసేన పరస్పరం సహకరించుకున్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా..లేదా అనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. ఇక, మంత్రితో పాటుగా..ఓడిన జెడ్పీటీసీల్లో భాగంగా కొద్ది రోజులుగా వివాదస్పదంగా మారిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గం లోనూ వైసీపీ జెడ్పీటీసీ కోల్పోయింది.అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్ధి రమణమ్మ గెలుపొందారు.

ఆరు స్థానాలు టీడీపీ గెలవటంతో..
మరో స్థానం.. మోపిదేవి జెడ్పీటీసీ...ఇక్కడ టీడీపీ నుంచి మల్లిఖార్జున రావు గెలుపొందారు. ఈ జెడ్పీటీసీ స్థానం క్రిష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. అక్కడ సింహాద్రి రమేశ్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే విధంగా..తూర్పు గోదావరి జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలు వైసీపీ కోల్పోయింది. అందులో ఒకటి రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని వర రామచంద్రాపురం. ఈ జెడ్పీటీసీలో టీడీపీ అభ్యర్ధి వల్లా రంగారెడ్డి 849 ఓట్లతో గెలిచారు. అక్కడ ధనలక్ష్మీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే జిల్లాలో కడియంలో జనసేన అభ్యర్ధి మర్గాని అమ్మని గెలుపొందారు.

భారీ గెలుపుతో వారికి ఊరట ఇస్తారా
ఈ జెడ్పీటీసీ రాజమండ్రి రూరల్ పరిధిలోకి వస్తుంది. అక్కడ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా.. ఆకుల వీర్రాజు వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. పశ్చిమ గోదావరిలో మరో స్థానం వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం జెడ్పీటీసీని సైతం వైసీపీ కోల్పోయింది. అదే విధంగా..కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ పరిధిలోని గోపవరం జెడ్పీటీసీని టీడీపీ అభ్యర్ధి కలువాయి జయరామి రెడ్డి 104 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు.

నాడు తండ్రి తరహాలోనే ఇప్పుడు జగన్ వ్యవహరిస్తారా
అనంతపురం జిల్లా లోని అగలి జెడ్పీటీసీని టీడీపీ అభ్యర్ధి ఉమేశ్ 656 ఓట్ల తేడాతో దక్కించుకున్నారు. దీంతో..గతంలో వైఎస్సార్ వ్యవహరించిన విధంగానే జగన్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నిర్వహణ విషయంలో సీరియస్ గా ఉండే జగన్ కఠినమైన సంకేతాలు ఇవ్వటం ద్వారా పార్టీలో మరింతగా నేతలు అలర్ట్ అవుతారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా ఇంత భారీ విజయం సాధించిన క్రమంలో చర్యలు ఉంటాయా లేవా అనేది కూడా సందేహంగానే కనిపిస్తోంది
Recommended Video

జగన్ నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ
అందులో మంత్రి రంగనాధరాజు తొలి నుంచి జగన్ కు మద్దతుగా ఉన్నారు. కానీ, తాను ఎన్నికల ఫలితాల విషయంలో ఎంత సీరియస్ గా ఉంటానో సంకేతాలిచ్చే క్రమంలో జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకొనే అవకాశం ఉందంటూ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే, ఇప్పుడు ఆచంటలో టీడీపీ జెడ్పీటీసీ గెలవటం ద్వారా మంత్రి రంగనాధ రాజు పైన రఘురామ రాజు లాంటి వారు విమర్శలను ఎక్కు పెట్టటానికి ఇదొక అవకాశంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల పైన సీఎం స్పందించారు. ఈ ఫలితాలతో తమ పైన మరింత బాధ్యత పెరిగిందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications