వాళ్ళు బోరున ఏడుస్తుంటే అసెంబ్లీలో చంద్రబాబు డబ్బా కొడుతున్నారు, ఉసురు తగులుద్ది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతులను నిండా ముంచేశారని, అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వం డబ్బా కొడుతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రైతులు ఇంట కన్నీళ్లు పెట్టించిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఉల్లి రైతుల ఉసురు తగలకపోదు అని శాపనార్థాలు పెట్టారు.
ఉల్లి ఎండినా నష్టమే.. పండినా నష్టమేనా?
ఉల్లి రైతులకు ఎప్పుడు కష్టాలు తప్పడం లేదని, ఉల్లి ఎండినా నష్టమే..ఇప్పుడు పండినా నష్టమే అన్నట్టుగా పరిస్థితి ఉందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉల్లి రైతులు ఎకరాకు రూ.1.20లక్షల పెట్టుబడి పోసి పండిస్తే, మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా ? క్వింటాకు 50 రూపాయలా ? అని నిలదీశారు. ఆరుగాలం కష్టించి ఉల్లి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3వేలు మాత్రమే అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

ఉల్లి రైతులను అప్పుల పాలు చేయడమా రైతు సంక్షేమమంటే
ఉల్లి వేసిన కారణంగా ఒక్కో రైతుకి వచ్చిన నష్టం ఎకరాకు అక్షరాల రూ.లక్షా 15 వేలు అని లెక్కలు చెప్పారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారే. అలాంటి ఉల్లి పండించే రైతే ఉరేసుకొనే పరిస్థితి వస్తే మీరేం చేస్తున్నారు ? అంటూ ప్రశ్నించారు. ఉల్లి రైతులను అప్పుల పాలు చేయడమా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ? అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు.
రైతులను ఉద్ధరించినట్లు గొప్పలు
ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుంది ? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ధర లేక బేజారు అవుతుంటే ఉల్లి రైతు కళ్ళల్లో ఆనందం ఎక్కడుంటుంది అని ప్రశ్నించిన షర్మిల, కర్నూల్ మార్కెట్ లో దళారుల ధరతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.1200 ఇస్తాం అన్నారు. రైతులను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పారు. ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు.
ఎక్కడుంది రైతు కళ్ళల్లో ఆనందం
ఒక్క రైతుకైనా రూ.1200 గిట్టుబాటు ధర ఇచ్చారా? ఒక్క కిలో అయినా మార్క్ ఫెడ్ సేకరించిందా? అంటూ షర్మిల నిలదీశారు. 50 పైసలకు అమ్ముకోలేక మార్కెట్ లోనే ఉల్లిని వదిలేస్తుంటే, కూలి ఖర్చుల మందం కూడా రాలేదని బోరున విలపిస్తుంటే ఎక్కడుంది రైతు కళ్ళల్లో ఆనందం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర వెయ్యికి పెంచేందుకు పెట్టిన శ్రద్ధ రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరం అన్నారు.
ఉల్లి రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్న షర్మిల
కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉల్లి ధరాఘాతంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు. ఉల్లి రైతుల కష్టాల మీద చర్చ చేపట్టాలని డిమాండ్ చేసారు.మార్క్ ఫెడ్ ద్వారా ఇస్తామని చెప్పిన రూ.1200 వెంటనే అందేలా చూడాలన్నారు. కర్నూల్ మార్కెట్ లో దళారుల మాయాజాలన్ని వెంటనే అరికట్టాలన్నారు.












Click it and Unblock the Notifications