మహానాడు వేళ కడపలో వైఎస్ రాజారెడ్డి శతజయంతి- తాతపై షర్మిల పొగడ్తల జల్లు..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఇవాళ ఆయనకు మనవరాలు, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఘన నివాళులు అర్పించారు. కడప జిల్లా పులివెందులలో రాజారెడ్డి ఘాట్ కు వెళ్లిన షర్మిల.. అక్కడ తాతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాత రాజారెడ్డిపై షర్మిల ప్రశంసల జల్లు కురిపించారు. తన తండ్రి వైఎస్సార్ ఆ స్థాయికి రావడానికి తాత రాజారెడ్డే కారణమన్నారు.
రాజారెడ్డి అంటేనే ధైర్యం,సాహసం, పట్టుదల అని వైఎస్ షర్మిల తెలిపారు. సాహసానికి మారుపేరు రాజారెడ్డి అన్నారు. వైఎస్సార్ ను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి తీర్చి దిద్దారని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ లెజెండ్ అయ్యారంటే రాజారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే అన్నారు. రాజారెడ్డి ఒక ప్రజా నాయకుడని, ప్రజా సమస్యలపై ఆయనకు ఎంతో చిత్త శుద్ధి ఉండేదని గుర్తుచేశారు. తాను దగ్గర నుంచి రాజారెడ్డిని చూశానన్నారు.

గంటల తరబడి ప్రజల సమస్యలు వినే వారని, వాటిని పరిష్కారం అయ్యే వరకు నిద్ర పోయే వాడు కాదని షర్మిల తెలిపారు. ప్రజల కోసం ఎన్నో విద్యాసంస్థలు కట్టించాడన్నారు. ప్రజలకు ఆసుపత్రి కూడా కట్టించి ఇచ్చాడన్నారు. ప్రజల కోసం ఇంత చేసిన రాజారెడ్డి ప్రజా నాయకుడన్నారు.రాజారెడ్డి బిడ్డలను ఎంతో బాగా చూసుకున్నాడని, తన ఆడబిడ్డలను సైతం ఎంతో బాగా చూసుకున్నాడని షర్మిల గుర్తుచేసుకున్నారు. రాజారెడ్డి స్పూర్తి తమకు ,నేటి తరానికి ఎంతో ఆదర్శమన్నారు.

మరోవైపు ఇవాళ వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమాలకు మనవడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దూరంగా ఉండిపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి సోదరి షర్మిల ఘనంగా నివాళులు అర్పించినా..జగన్ మాత్రం ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. తల్లిని, చెల్లినే కాదు తాత వారసత్వానికే దూరంగా ఉండిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications