రాహుల్ అనర్హత వేటుపై భగ్గుమన్న ఏపీ కాంగ్రెస్-విజయవాడలో ఆందోళనలు..
విజయవాడ : ప్రధాని మోడీపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi)పై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సచివాలయం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయాన్ని రాజకీయ పక్షాలన్నీముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపడుతున్నాయి. ఏపీలోనూ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.
రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు విజయవాడలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఏపీలో వివిధ ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. రాహుల్ పై కేంద్రం కక్షసాధింపుకు నిరసనగా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయవాడలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు కేంద్రం తీరుపై మండిపడ్డారు.

దేశంలో కుల మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆరోపించారు. మోడీ, అమిత్ షాలు దొంగలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారన్నారు. వీరి అవినీతిని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. పార్లమెంటు లో కూడా వారిని అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం వారిలో ఉందని పద్మశ్రీ తెలిపారు. అందుకే సూరత్ కోర్టు తీర్పు ఆధారాంగా పార్లమెంట్ లో అనుర్హుడిగా ప్రకటించారన్నారు.

రెండేళ్లు జైలు శిక్ష పడిందనే సాకుతో.. ఇప్పటికిప్పుడు నిర్ణయిస్తారా అంటూ సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారిని మాత్రం మోడీ కాపాడతారా అని నిలదీశారు. ఎన్నికలలో ధైర్యంగా ఎదుర్కోలేక గతంలో తప్పుడు కేసులు పెట్టారన్నారు. రాజ్యాంగ బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని ఎలా అనర్హుడిగా ప్రకటిస్తారన్నారు. మోడీ, అమిత్ షాలు విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని పద్మశ్రీ విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులంతా తమ నాయకుడికి అండగా ఉంటామన్నారు. రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేకే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టారన్నారు.












Click it and Unblock the Notifications