ఏపీలో 9 విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం.. కీలక నిర్ణయం వెనుక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థను గాడిలో పెడుతుంది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మరికొన్ని వారాలలో ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి విశ్వవిద్యాలయాల పైన దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకుంది.
తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి వైస్ ఛాన్సలర్ ల నియామకాన్ని పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా జి పి రాజశేఖర్ ను నియమించారు. కాకినాడలోని జేఎన్టీయూ విసిగా సి ఎస్ ఆర్ కె ప్రసాద్ ను నియమించారు.

నూతన వీసీలు వీరే
మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ విసిగా రాంజీ ను, కడప యోగివేమన యూనివర్సిటీ విసిగా ప్రకాష్ బాబును నియమించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ విసిగా ఉమా, ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీగా కే ప్రసన్న, రాయలసీమ యూనివర్సిటీ విసిగా వెంకట బసవరావు, నెల్లూరులోని విక్రమ సింహపురి వీసీ గా శ్రీనివాస్ మోహన్, అనంతపురంలోని జేఎన్టియు విసిగా సుదర్శన్ రావు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీగా నారీ శక్తి పురస్కార గ్రహీత
విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ విసీలను నియమించి విశ్వవిద్యాలయాలలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్ గా నియమించిన ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడటానికి ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన కృషిని మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 2022లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాన్ని అందించారు.
యూనివర్సిటీల పాలనా వ్యవస్థపై ఏపీ సర్కార్ ఫోకస్
ఇక ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైన ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్పూర్ లో గణిత శాస్త్ర ఆచార్యుడిగా కొనసాగుతున్నారు.మొత్తంగా అన్ని యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించి యూనివర్సిటీల పాలనా వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది.












Click it and Unblock the Notifications