APSRTC: సంక్రాంతి రికార్డులు బద్దలు కొట్టిన ఆర్టీసీ..! కాసుల పండగే..
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఈ సంక్రాంతికి పాత రికార్డులన్నీ తిరగ రాసేసింది. సంక్రాంతి సందర్భంగా భారీ ఎత్తున ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు వాటిలోనూ అదనపు ఛార్జీలు లేకుండానే నడిపిన ఆర్టీసీ.. అందుకు తగ్గ ప్రతిఫలం రాబట్టుకొంది. తద్వారా ఓ కొత్త మోడల్ ను ప్రయోగించి భారీ ప్రయోజనం పొందింది. సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతీ రోజూ సగటున రూ.20 కోట్ల మేర ఆదాయం లభించినట్లు ఆర్టీసీ ప్రకటించింది.
ఈసారి సంక్రాంతి సందర్బంగా ఏపీకి వచ్చే వారి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఇతర రాష్ట్రాల్లోని నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. మరోవైపు రాష్ట్రం నుంచి తిరిగి ఆయా నగరాలకు వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేక సర్వీసులు పెట్టింది. అలాగే రాష్ట్రంలోనూ ఈసారి భారీ ఎత్తున ప్రత్యేక సర్వీసుల్ని సంక్రాంతి సందర్భంగా అందుబాటులో ఉంచింది. అయినా సంక్రాంతి రద్దీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆర్టీసీ భారీ ఎత్తున ఆదాయం ఆర్జించింది.

ఈసారి సంక్రాంతి సందర్భంగా మొత్తం 9 వేలకు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపింది. జనవరి 8 నుంచి 20వ తేదీ వరకూ రానుపోనూ ప్రయాణాలకు వీటిని నడిపింది. వీటితో పాటు సాధారణ సర్వీసుల్ని కలుపుకుని సగటున రోజుకు రూ.20 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్టీసీ అర్జించింది. అలాగే కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారానే రూ.21 కోట్ల ఆదాయం సాధించింది. ఈ నెల 20న ఒక్క రోజే రికార్డు స్ధాయిలో రూ.23.71 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ అర్జించింది. ఇది ఆర్టీసీ చరిత్రలోనే రికార్డుగా చెప్తున్నారు.
గతంలో ఆర్టీసీ సంక్రాంతి సర్వీసులు అంటేనే ప్రత్యేక ఛార్జీల మోత అన్నట్లు ఉండేది. సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటూ ఆర్టీసీ ఏకంగా 50 శాతం వరకూ అదనపు ఛార్జీలు వడ్డించేసేది. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు తప్పని సరి పరిస్ధితుల్లో ఇలా అదనపు మొత్తం చెల్లించి ప్రత్యేక సర్వీసులు వినియోగించుకునే వారు. దీంతో ఆర్టీసీకి భారీగానే ఆదాయం వచ్చేది. కానీ ఈసారి మోడల్ మార్చి అదనపు ఛార్జీలు లేకుండా నడిపినా భారీ ఎత్తున ఆదాయం లభించింది..












Click it and Unblock the Notifications