ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు ఇవి సిద్ధం చేసుకోండి
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ప్రకటించిన పథకాలను అమలు చేయబోతోంది. అందులో ప్రధానమైంది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ప్రస్తుతం ఈ పథకం తెలంగాణతోపాటు కర్ణాటకలో కూడా అమలవుతోంది. ఈ పథకం అమల్లో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే విశాఖపట్నంలో మాట్లాడుతూ నెలరోజుల్లో ఈ పథకాన్ని అమల్లోకి తేబోతున్నట్లు చెప్పారు. అధికారులు దీన్ని అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు.
ఈ నెల మొదటివారంలో ఆయన ఈ ప్రకటన చేశారు. నెలరోజులంటే ఆగస్టులో అమలు చేసే అవకాశం ఉందని భావించవచ్చు. ఆర్టీసీ విలీనం ప్రభుత్వంలో సంపూర్ణంగా జరగలేదు. ఈ సమస్యను పరిష్కరిస్తూనే ఉచిత ప్రయాణాన్ని కూడా ప్రారంభించాల్సి ఉంది. అంతేకాకుండా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. వీటిని నడిపేందుకు డ్రైవర్ల శిక్షణ కోసం దాదాపు రూ.19 కోట్ల వరకు ప్రభుత్వం కేటాయింది. ఈ పథకాన్ని మొదటగా విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలు తమదగ్గర కొన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగివుండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు, మహాశక్తి స్మార్ట్ కార్డు, అడ్రస్ ప్రూఫ్.. వీటిల్లో ఏదో ఒకటి కచ్చితంగా కలిగివుండాలి. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక పోర్టల్ ను తయారుచేయబోతోంది. అది సిద్ధమయ్యాక మహిళలు పోర్టల్ లోకి ఎంటర్ అవ్వాలి. దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతోంది.












Click it and Unblock the Notifications