దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. స్పెషల్ బస్సులు..
రెండు తెలుగురాష్ట్రాల్లో పెద్ద పండుగయిన దసరా పండుగ సంబరాలు రానే వచ్చాయి. ఈ పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు ప్రజలు పట్టణాల నుంచి భారీగా తరలివెళ్లనున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర పట్టణాలకు వెళ్లినవారంతా ఇలాంటి పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్‌టిసి భారీ శుభవార్త చెప్పింది. దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకోని ఎపీఎస్ఆర్‌టిసి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటుంది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసులను నడిపేందుకు సంస్థ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది.
దసరా పండుగ అనగానే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయమే అందరికీ గుర్తొస్తుంది. ఈ పండుగవేళ ఎక్కడెక్కడివారంతా అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. ఇక, ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3వ తేది నుంచి 12వ తేది వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. దసరా పండుగకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు భారీగా సెలవులు రావడంతో చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లేందకు ఆసక్తి కనబరుస్తారు. ఇలాంటి సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్‌టిసి అక్టోబర్ 3వ తేది నుంచి 15వ తేది వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.

13 రోజులు స్పెషల్ బస్సులు..
మొత్తం 13 రోజులపాటు ఈ స్పెషల్ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్‌టిసి సిద్ధమైంది. ఇక, ఈ ఏడాది అన్ని మార్గాల్లో కంటే హైదరాబాద్‌కు అత్యధికంగా 353 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎందుకంటే, హైదరాబాద్ వంటి నగరానికి ఉపాధి కోసం వెళ్లిన వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. వారిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజమహేంద్రవరం రూట్‌కి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్పెషల్ బస్సుల్లో భాగంగా మొదటి మూడు రోజులు 37 సర్వీసులు చొప్పున నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 8 నుంచి బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నట్లు అధికారులు వివరించారు. అక్టోబర్ 9వ తేదిన 105 బస్సులు, 10వ తేదిన 117 బస్సులు, 11వ తేదిన 128 బస్సులు నడపనున్నారు. దసరా పండగ మరుసటి రోజు (అక్టోబర్ 13) 128 బస్సులు, 14వ తేదిన 103 బస్సులు నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది.












Click it and Unblock the Notifications