APSRTC : ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం-ఇక బస్సుల్లోనే కొరియర్ బుకింగ్
మూలిగే నక్కపై తాడిపండులా అసలే ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా ప్రభావం, చమురు ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా పడింది. గతేడాది కాలంలో వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన ఆర్టీసీని బయటపడేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల రవాణాతో పాటు ఇతర మార్గాల్నీ వెతుకుతోంది. దీంతో కొరియర్ బుకింగ్స్ సేవల్ని మరింత విస్తృతం చేస్తోంది.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఓ బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకు కొరియర్ కవర్లు, కార్గో పార్శిల్ సేవలు అందిస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ.. ఇక గ్రామీణ ప్రాంతాలకు వీటిని విస్తరించనుంది. చిన్న పట్టణాలు, పల్లెలకు వెళ్లే బస్సుల్లోనూ కండక్టర్ ద్వారా కిలో లోపు బరువు ఉండే కవర్లు రవాణా చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కండక్టర్ల వద్ద ఉండే టికెట్ల జారీ యంత్రాల(టిమ్స్)ను వాడబోతున్నారు. ఇందులోనే కొరియర్ బుక్‌చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి టిమ్ ద్వారా రశీదు ఇస్తారు. వీటిని బుక్‌చేసుకున్న వారు.. దానిని అందజేయాల్సిన చిరునామాను కవరుపై రాసి సంబంధిత వ్యక్తులకు ఫోన్‌చేసి బస్సు వచ్చే సమయానికి సిద్ధంగా ఉండాలని చెప్పాలి. సదరు ఆ బస్టాప్‌లో కండక్టర్ వీటిని అందజేస్తారు.

కండక్టర్లు లేదా ట్రైవర్ల వద్దనున్న టిమ్ యంత్రాల ద్వారా ఇలా చిన్న కొరియర్ కవర్ల బుకింగ్‌ను మరో వారంలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన బస్టాండ్లలో ఆర్టీసీ కొరియర్, కార్గో సేవలు ఉండగా, అన్ని జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాల్లో డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. గ్రామాలు, చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉండేవారికి సైతం ఆర్టీసీ ద్వారా కొరియర్ సేవలు అందించేందుకు కొత్తగా దీనిని అమలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి కార్గో ద్వారా నిత్యం సగటున రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇప్పుడు చిన్న కొరియర్ల బుకింగ్ ద్వారా అందులో కనీసం నాలుగో వంతు ఆదాయం వచ్చినా చాలనేది ఆర్టీసీ ఆలోచనగా ఉంది.












Click it and Unblock the Notifications