తిరుమలలో ఆ రోజున కల్యాణోత్సవం, ఇతర ఆర్జిత సేవలు రద్దు
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. శుక్రవారం నాడు 60,958 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 31,245 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.41 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
కంపార్ట్‌మెంట్లన్నీ కూడా నిండిపోయాయి. భక్తులు క్యూలైన్‌లో వేచి ఉంటోన్నారు. సేవా సదన్ వరకూ భక్తులు భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల వల్ల రద్దీ భారీగా ఏర్పడింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

ఈ నెల 9వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది రోజు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవలను నిర్వహిస్తారు. అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు.
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా మలయప్పస్వామివారు ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. టీటీడీ ఆగమ పండితులు, అర్చకులు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అష్ట దళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు రద్దయినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications