ఫోటో: హైద్రాబాద్‌లో ఎవోసిలోకి నో ఎంట్రీ, కాస్త సడలింపు
హైదరాబాద్: కంటోన్మెంట్ ప్రాంతంలోని ఏవోసి సెంటర్‌కు అనుసంధానంగా ఉన్న వెల్లింగ్టన్, మార్నింగ్టన్, ఎన్‌ట్రెచ్‌మెంట్, గాఫ్, ఆర్డినెన్స్ రహదారులపై అధికారులు ఆంక్షలు విధించారు. అయితే, విమర్శలు రావడంతో కొంత సడలించారు. పౌర వాహనాలు తమ ఏరియా మీదుగా రాకపోకలు సాగించడం వల్ల రక్షణ శాఖ స్థావరాలు, శిక్షణ సంస్థలు, కార్యాలయాల భద్రతకు ముప్పు ఉండడంతో పాటు, తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నందున తమ ఆధీనంలోని రోడ్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు చేసిన ప్రకటనను రక్షణ శాఖ అమలులోకి తెచ్చింది.
కంటోన్మెంట్‌లోని పలు ప్రధాన రహదారులపై మంగళవారం రాత్రి నుంచి ఆంక్షలను అమలు చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మిలిటరీకి సంబంధించిన రహదారులపై పౌరుల వాహనాలను నిషేధిస్తూ రక్షణ శాఖ అధికారులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. అయితే, పౌరుల నుంచి వస్తున్న అభ్యర్థనలు, విన్నపాలను పరిశీలించామని, శనివారం రాత్రి ఆర్మీ, పోలీసు, పౌర అధికారుల ఉమ్మడి సమావేశం జరిగిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు రాత్రి పది గంటల నుంచి ఉదయం 7.30 గంటల వరకే ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు. కంటోన్మెంట్‌ను ఆనకుని ఉన్న కాలనీవాసుల సంక్షేమ సంఘాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఆ సమయంలో ప్రకటిస్తామన్నారు.

వచ్చే నెల 9వ తేదీ తర్వాత ఈ రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా(స్కూల్ బస్సులు, అంబులెన్సులు తదితర ఎమర్జన్సీ వాహనాలు మినహా) నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఆంక్షలు అమలులోకి వస్తాయనే విషయాన్ని మరిచిన పౌరులు ఆంక్షలు అమలు చేస్తున్నట్టుగా వివిధ సర్కిళ్ల వద్ద ఏర్పాటు చేసిన గేట్లు, బోర్డులను చూసి ఉసూరుమన్నారు.












Click it and Unblock the Notifications