ఏపీలో నేటి నుంచి గ్రామ గ్రామాన..
Aarogya Suraksha: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు దీన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని పేదలందరికీ కుటుంబ సంక్షేమం, ఆరోగ్య భరోసా కల్పించడంలో భాగంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇదివరకు తొలి విడత కార్యక్రమాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి 50 రోజుల పాటు కొనసాగింది. వార్డు/గ్రామ వలంటీర్లు, ఎఎన్ఎంలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించారు. ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్న వారి కోసం గ్రామాలు, వార్డుల్లోనే హెల్త్ క్యాంపులను నిర్వహించారు. వైద్య సేవలను అందించారు.

దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైన వారికి ఆసుపత్రులకూ సిఫారసు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 60 లక్షల మందికి వాళ్ల ఇంటి వద్దే నాణ్యమైన వైద్యాన్ని అందించింది ప్రభుత్వం. రోగులు ఆసుపత్రుల వరకూ వెళ్లకుండా వారికి ఇంటివద్దే సమగ్ర వైద్యాన్ని అందజేసింది ఏపీ ప్రభుత్వం.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టిన తరువాత ఆసుపత్రుల్లో ఓపీ పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గిందనే ప్రచారం సైతం జరిగింది. ప్రజల నుంచి దీనికి అద్భుత స్పందన లభించింది. ఫలితంగా- రెండో విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు మొదలు కానున్నాయి.
రేపటి నుంచి పట్టణాలు, నగరాల్లో ఈ శిబిరాలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆరు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఆరు నెలల్లో 13,954 శిబిరాలను నిర్వహిస్తారు. గ్రామాల్లో 10,032, పట్టణాలు- నగర ప్రాంతాల్లో 3,922 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటవుతాయి.

ఒక్కో వైద్య శిబిరం వద్ద 105 రకాల మందులు, అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచడానికి జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజల ఆరోగ్య సమస్యల గురించి తెలుసు కోవడానికి వలంటీర్లు, ఎఎన్‌ఎంలు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించేలా ప్రణాళికను రూపొందించింది జగన్ ప్రభుత్వం. అర్బన్ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం, అర్బన్ ప్రాంతాల్లో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటవుతాయి.












Click it and Unblock the Notifications