ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అరెస్టుకు వారంట్
ఖమ్మం: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేస్తూ ఖమ్మం రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ. సునీతారాణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ పరువు నష్టం దావాలో మెజిస్ట్రేట్ ఆ ఉత్తర్వులు జారీ చేశారు.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010లో కోర్టులో కేసు వేశారు.

ఈ కేసులో బుధవారం ఖమ్మం కోర్టుకు రాధాకృష్ణ హాజరు కావాల్సి ఉండింది. కానీ, ఆయన రాకుండా ఇద్దరు న్యాయవాదుల ద్వారా ఇద్దరు పూచీకత్తుదారులను హాజరుపరిచారు. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేస్తూ వచ్చే నెల 10వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసింది.
ఇదిలావుంటే, శాసనసభ ఎన్నికల్లో తన ఓటమిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రకటనలు ప్రచురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం సమాజంలో తన గౌరవమర్యాదలకు నష్టం కలిగించిందని ఆరోపిస్తూ మాజీ శాసనసభ్యుడు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి కొండేటి శ్రీధర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications