రాజ్యసభ: ఏపీకి హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన అరుణ్ జైట్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో శుక్రవారం స్వల్పకాలిక చర్చకు వచ్చింది. ఈ చర్చలో భాగంగా ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలుపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేస్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు మాట్లాడాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ తొందరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. గతంలో వాయిపేయి ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశాం

ఆ సమయంలో తాము ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేశామని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో ఒక్కరు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని అన్నారు. ఆనాడు శాసనసభలో తీర్మానాలు, సంప్రదింపుల ద్వారా రాష్ట్రాల విభజన జరిగిందని అన్నారు.

ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని సూచించారు. దేశంలో చిన్న రాష్ట్రాలు ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని నమ్మే పార్టీ బీజేపీయేనని జైట్లీ వివరించారు. రాష్ట్ర విభజన భావోద్వేగాలతో కూడిన అంశంమని చెప్పారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం కోల్పోయిన మాట నిజమేనని అన్నారు.

ఏపీ రెవెన్యూ లోటులో ఉంది

బాగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం, విభజన తర్వాత తెలంగాణలో ఉండిపోయిందని, హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు రావడంతోనే ఏపీలో రెవెన్యూ లోటు ఉందని చెప్పారు. గతంలో ఏ రాష్ట్రాన్ని విభజించినా, రాజధాని కదల్లేదని, అవిభాజ్య ఏపీ విషయంలో మాత్రం అలా జరగలేదని గుర్తు చేశారు.

దీంతో కొన్నేళ్ల వరకు ఆంధ్రప్రదేశ్‌‌కు చేయూత ఇవ్వాల్సిన అవరసం ఉందన్నారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ తదితరాల్లో రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనాలను కలిగిస్తున్నామని జైట్లీ వివరించారు. కేంద్రం నుంచి 42 శాతం నిధులు రాష్ట్రాలకు వెళుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం వద్ద కేవలం 52 శాతం నిధులు మాత్రమే ఉంటాయని అన్నారు.

ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో ఏ రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయమై, తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దానికి అనుగుణంగానే సాగుతున్నామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వం ఎంతో అభివృద్ధి చెందిన అధికాదాయ రాష్ట్రమని గుర్తు చేసిన ఆయన, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలతో ఎందులోనూ తీసిపోలేదని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులుపై రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని అన్నారు.

మిత్రపక్షం అధికారంలో ఉందని ఎక్కువ నిధులు కేటాయించలేం

మిత్రపక్షం అధికారంలో ఉందని ఎక్కువ నిధులు కేటాయించలేమని తేల్చిచెప్పారు. నిధులు కేటాయింపు విషయంలో అన్ని రాష్ట్రాలను సంతృప్తి పరచలేమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు కేంద్రం అండగా ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఉందని అన్నారు.

ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎంలాంటి విద్యాసంస్ధలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్ఐటీ సెప్టెంబర్ 2017 నుంచి పని చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో ఆగస్టు 2017 నుంచి ఐఐఎస్‌సీ, పవర్ ప్రాజెక్టులకు బోగ్గు గనులు, నేషనల్ హైవేల్లో ఏపీకి ఇప్పటికే చాలా చేశామని జైట్లీ చెప్పారు. విశాఖకు మెట్రో డీపీఆర్ కేంద్రం పరిధిలో ఉందని అన్నారు.

విభజన చట్టంలో ఎన్నో అంశాలను పొందుపరిచారని, అవన్నీ ఏపీ అభివృద్ధికి సహకరించేవేనని అన్నారు. కేవలం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే రాష్ట్రాలు అభివృద్ధి చెందవని, ప్రజలు, పాలిస్తున్న ప్రభుత్వాలు, కేంద్రం కృషి వల్లే ముందడుగు సాధ్యమని అన్నారు.

రైల్వేజోన్‌కు కసరత్తు

ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించే అంశంపై సురేశ్ ప్రభు పరిశీస్తున్నారని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతిష్టాత్మక సంస్థలన్నింటిని ఏర్పాటు చేస్తామని అన్నారు. 13వ షెడ్యూల్‌లోని సంస్థలన్నింటినీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విషయంలో నాబార్డుతో చర్చిస్తున్నామని చెప్పారు.

పోలవరం నిధులు

ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కూడా నాబార్డుతో చర్చలు జరుపుతోందని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాజధానిని నిర్మించాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దశలవారీగా నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.

నీటి పారుదల రాష్ట్రాల బాధ్యతే అయినా, ఏపీ విషయంలో కల్పించుకుని నిధులిచ్చామని అన్నారు. తీసుకున్న డబ్బుకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని అన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ఏపీకి లోటు ఏర్పడితే దాన్ని భర్తీ చేసేందుకు కట్టుబడి వున్నామని తెలిపారు.

రాజధానిలో రాజ్ భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఏర్పాటు నిమిత్తం రూ. 2,500 కోట్లను అందించామని తెలిపారు. రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్రానికి అందించామని వెల్లడించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆ నిధులను ఎలా వెచ్చించారో పరిశీలించిన తర్వాతనే మరిన్ని నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.

ఈ దశలో సుజనా చౌదరి కల్పించుకుని కేంద్రం సాయం చేస్తున్న విషయం నిజమేనని, రాజధాని నిమిత్తం ఇచ్చిన రూ. 2,500 కోట్లలో రూ. 1000 కోట్లను గుంటూరు, విజయవాడల్లో మురుగు నీటి పారుదలకు కేటాయించారని గుర్తు చేశారు. దానిని రాజధానికి ఇచ్చిన నిధులుగా పరిగణించకూడదని జైట్లీని కోరారు.

ఏపీకి పన్ను రాయితీలు ఇచ్చాం

ఆ తర్వాత జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే చివరిగా ఇచ్చిన నిధి కాదని, దశలవారీగా ఏపీకి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా, ఏపీకి పన్ను రాయితీలు ఇచ్చామని అన్నారు.

ఈ రాయితీల్లో భాగంగా రాష్ట్రానికి అందిన అదనపు నిధులను సక్రమంగా వెచ్చించాలని సూచించారు. ఏపీకి పన్ను రాయితీలు ఇవ్వడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని అన్నారు. ఏపీకి ఇచ్చిన నిధులు సరిపోవని టీడీపీ అంటోంది. ఆనాడు పరిశ్రమలన్నీ ఏపీకి వెళితే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించిందని గుర్తు చేశారు.

ఉత్తరాఖండ్ పర్వత రాష్ట్రం అందుకే ప్రత్యేకహోదా

'కృషి సంచాయి' పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 8 ప్రాజెక్టులు కేటాయించామని తెలిపారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలనేది ఎన్టీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఉత్తరాఖండ్ పర్వత రాష్ట్రం కనుకనే ప్రత్యేకహోదా ఇచ్చామని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు కనుక ప్రత్యేకహోదాను పొందాయని తెలిపారు.

చివరగా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో నిబంధనలను సాకుగా చూపి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Central minister Arun jaitley on kvp private member bill in rajya sabha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి