ఎన్నికలు: అసదుద్దీన్ ఓవైసిపై రాంగోపాల్ వర్మ పోటీ?
హైదరాబాద్: వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ-శివసేన కూటమి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓవైసీపై రెండు పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని నిలపాలని నిర్ణయించాయి. ఓ జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను అసదుద్దీన్‌పై పోటీకి దించే యోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బిజెపితో పొత్తును కొనసాగిస్తామని శివసేన ఏపి కో-ఆర్డినేటర్ దిలీప్ తమల్ తెలిపారు. ఇందులో భాగంగా లోకసభ ఎన్నికల్లో రెండు పార్టీల తరపున ఒకే అభ్యర్థిని నిలపాలని యోచిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోకసభ స్థానంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓ ప్రముఖ సినీ దర్శకుడిని ఈ స్థానం నుంచి పోటీకి దించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. మిగితా వివరాలు త్వరలోనే చెబుతామని తమల్ పేర్కొన్నారు. ఇతర వివరాలు త్వరలోనే చెబుతామని తెలిపారు.

కాగా ఆ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మనే అని స్పష్టమవుతోంది. గత ఆగస్టులో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి వచ్చిన సమయంలో రాంగోపాల్ వర్మ ఆయనను కలిసిన విషయం తెలిసిందే. సీమాంధ్రకు చెందిన రాంగోపాల్ వర్మ.. చిన్నతనంలోనే హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అయితే హైదరాబాద్ లోకసభ స్థానంపై గట్టి పట్టు ఉన్న అసదుద్దీన్‌కు రాంగోపాల్ వర్మ ఏ మేరకు పోటీ ఇస్తారనేది తేలాల్సి ఉంది. 1984 నుంచి హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు.
రాష్ట్ర శివసేన అధ్యక్షుడు టిఎన్ మురారీ మాట్లాడుతూ.. శివసేన-బిజెపి పార్టీలు సంయుక్తంగా అభ్యర్థులను బరిలోకి దింపుతాయని చెప్పారు. 2004 ఎన్నికల్లో తమ పార్టీ తరపున తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని అసదుద్దీన్‌పై పోటీకి దించే ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. అయితే అది కార్యరూపం దాల్చేలేకపోయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంద్ర జిల్లాల్లో కూడా తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలుపుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications