ప్రత్యేక హోదాపై తేల్చేసిన అశోక్: బాబుతో మోడీ భేటీకి ముందే ప్యాకేజీ ప్లాన్
విజయనగరం/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాదనే విషయం కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి మాటల్లోనూ వ్యక్తమైంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించడం అనుమానమేనని కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు.
విజయనగరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశమన్నారు. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని మాత్రమే కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దీక్షలు, ఉద్యమాల పేరుతో ప్రతి అంశాన్నీ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇప్పటికే తయారు చేసిన ‘ప్రాథమిక' ప్యాకేజీ ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. 25వ తేదీ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి మార్పు చేర్పులు చేయడం కన్నా రాష్ట్రానికి ఏం కావాలో ముందుగానే తెలుసుకుని సమగ్రంగా ప్యాకేజీని తయారు చేయాలని ప్రధాని మోడీ కేబినెట్ కార్యదర్శి పి.కె.సిన్హాకు సూచించినట్లు తెలిసింది.

దీంతో సిన్హా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ సింఘాల్‌ను ఫోన్‌లో సంప్రదించారు. ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అవసరాలు, ఆకాంక్షలు ఏమిటో చెప్పాలని ఆయన అడిగినట్లు తెలిసింది. దీంతో శాఖల వారీగా ఏపీ ప్రభుత్వం తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అనిల్ సింఘాల్ అందజేశారు. ఉత్తరాఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీతోపాటు ఇంకా అనేక అంశాలు ఈ నివేదికలో ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తమ వద్ద ఉన్న లెక్కలతో, తమ కోణంలో ఆలోచిస్తూ ప్యాకేజీని రూపొందించారు. తమ డిమాండ్లను పూర్తిస్థాయిలో పరిశీలించలేదని ఏపీ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్థికశాఖ తయారు చేసిన ప్యాకేజీ ‘పరిమాణం'లో బిహార్ ప్యాకేజీకన్నా ఎక్కువే ఉన్నా సాధారణంగా జరిగే బడ్జెట్ కేటాయింపులను కూడా అందులో కలిపేసినట్లు తెలుస్తోందంటూ శనివారం వార్తలు వచ్చాయి.
ప్రభుత్వం మాత్రం బడ్జెట్ ద్వారా వచ్చే నిధులు, 14వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను మినహాయించి నివేదిక తయారు చేసింది. పైగా పారిశ్రామిక రాయితీలను కూడా కోరుతోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారుల స్థాయిలో సమావేశాలు జరుగుతాయని ఆలోపలే ప్యాకేజీపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications