విభజనకు అసెంబ్లీ తీర్మానమే ముఖ్యం: అశోక్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు శాసనసభ తీర్మానమే ప్రధానమని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు అన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కాదనే సంస్కృతి పార్లమెంటుకు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శాసనసభ్యులందరూ తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ఓడించాలని, అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత కూడా ఆర్టికల్ 3 ద్వారా విభజన జరిపితే పార్లమెంటు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారని ఆయన అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులంతా రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనను అంగీకరించే ఏ ఒక్కరినీ తాము ఆమోదించబోమని ఆయన అన్నారు. విభజన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తాము సీమాంధ్ర శాసనసభ్యులకు వ్యక్తిగత లేఖలు రాస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ నోట్ మంత్రి వర్గం ముందుకు వస్తుందని తెలిసి కూడా ఒక్క ఎంపీ గానీ, మంత్రి గానీ స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణ నోట్‌ను టేబుల్ ఐటమ్‌గా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటూ సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయం వేరు, ప్రజాభిప్రాయం వేరని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైతే తమ చేతుల్లో ఉండదని ఆయన హెచ్చరించారు. విభజనను వ్యతిరేకిస్తూ ఎంపీలు రాజీనామా చేస్తే తాము తిరిగి గెలిపిస్తామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశం లేదు కాబట్టే గెలిపించామని చెప్పారు. తాము ప్రజల్లో భాగమని ఆయన అననారు.
పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ పార్లమెంటు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించే బలం ప్రజలకు ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడిపోతే పార్లమెంటులో బిల్లు వెనక్కి పోతుందని తాము అనుకుంటున్నామని ఆయన అననారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే విషయంలో తాము ఏం చేయలేమని ప్రజాప్రతినిధులు అంటే క్షమించబోమని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు పదవుల కోసం ఆరాటపడుతున్నారని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భూమాతకే భారంగా మారారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications