Arava Sreedhar: అరవ శ్రీధర్ రాజీనామాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న జనసేన నేత అరవ శ్రీధర్ (Arava Sreedhar) తాజాగా అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా సమర్పించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ సమర్పించారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శికి కూడా లేఖ పంపారు. దీనిపై ఇవాళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వ్యక్తిగత, ఊహించని పరిస్థితులను పేర్కొంటూ, ఆ పదవిలో తన బాధ్యతలను కొనసాగించలేనని తెలియజేస్తూ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా సమర్పించారని, ఈ రాజీనామాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలన నిమిత్తం సంబంధిత అధికార సంస్థకు పంపారని, దీని ప్రకారం, ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ సమర్పించిన రాజీనామా తక్షణమే అమలులోకి వచ్చేలా ఆమోదించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

జనసేన పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అరవ శ్రీధర్ పై ఆయన నియోజకవర్గం రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తూ వరుసగా వీడియోలు విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం కేసు నమోదు చేసినా వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే జనసేన పార్టీ తరఫున త్రిసభ్య కమిటీ విచారణ జరిపినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదే సమయంలో ఆయన అనుచరుడు బాధితురాలిని నడిరోడ్డుపై కొట్టడం వివాదాస్పదమైంది. ఇవన్నీ విపక్ష వైసీపీకి వరంగా మారాయి. దీంతో ప్రస్తుతానికి అరవ శ్రీధర్ తో అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేయించారు.














Click it and Unblock the Notifications