టీడీపీ మహానాడుకు వైసీపీసర్కార్ ఆటంకాలు; అధికారులా.. జగన్ వద్ద పాలేరులా? అచ్చెన్న వార్నింగ్!!
తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. ఒంగోలు వేదికగా మహానాడుకు ఏర్పాట్లను శరవేగంగా చేస్తుంది. ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో జరగబోయే మహానాడును విజయవంతం చేయాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

మహానాడుకు జనసమీకరణ చెయ్యకుండా అడ్డుకుంటున్న జగన్ సర్కార్ : అచ్చెన్న ఫైర్
మహానాడు సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కోసం జనసమీకరణ చేయకుండా ప్రభుత్వ ఆటంకాలు సృష్టిస్తుందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రవాణా శాఖ అధికారులను అడ్డుపెట్టుకుని ఎవరూ వాహనాలు ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహానాడు నిర్వహణకు ఆర్టీసీ అద్దె బస్సుల కోసం చలానాలు కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమని ప్రశ్నిస్తే వేసవి రద్దీ అంటూ కుంటిసాకులు చెబుతున్నారు అంటూ మండిపడ్డారు.

ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఇవ్వకుండా ఆటంకాలు
ఇక ప్రైవేటు వాహనదారులను మహానాడుకు వాహనాలను ఇస్తే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మహానాడుకు వాహనాలు ఇవ్వొద్దని బెదిరిస్తున్న అధికారుల వివరాలను సేకరించామని పేర్కొన్న అచ్చెన్నాయుడు వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. గత నలభై సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు మహానాడును ఘనంగా నిర్వహించాలని భావించి ఒంగోలు స్టేడియంలో మహానాడు నిర్వహణకు అనుమతి కోరితే జగన్ సర్కారు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు.

అధికారులా.. జగన్ వద్ద పాలేరులా? మండిపడిన అచ్చెన్న
ఒంగోలు స్టేడియంలో అనుమతి నిరాకరించడంతో రైతులు తాము తమ స్థలాన్ని ఇస్తామని ముందుకు వచ్చారని వెల్లడించారు. ఇక ఆర్టీసీ బస్సులను పంపకుండా అడ్డుకుంటున్న ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు గత ప్రభుత్వంలో పని చేయలేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారులా.. జగన్ వద్ద పాలేరులా అంటూ అధికారులపై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ సభలకు, సామాన్యులకు కూడా బస్సులను క్యాన్సిల్ చేసి సభలకు జనాన్ని తరలిస్తున్నారు కదా అంటూ మండిపడ్డారు.

ఖబడ్దార్ .. మీ సంగతి చూస్తాం... అచ్చెన్న వార్నింగ్
ఖబర్దార్ అధికారులారా.. మీ సంగతి తేలుస్తామని హెచ్చరించిన అచ్చెన్నాయుడు ప్రభుత్వ వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటే చీమలదండులా కదులుతామని, మహానాడు నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్లు, సొంత వాహనాల మీద మహానాడుకు తరలి వెళతామని, అవసరం అనుకుంటే నడిచి అయినా మహానాడుకు వెళతామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.

మహానాడు ద్వారా వైసీపీ సర్కార్ పై సమరభేరి మోగించాలి
ఇదిలా ఉంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా, ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరగబోయే తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పండుగ మహానాడు-2022 అని పేర్కొన్న అచ్చెన్న, కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అంటూ పేర్కొన్నారు.మహానాడు ద్వారా వైసీపీ సర్కార్ పై సమరభేరి మోగించాలని సూచించారు.












Click it and Unblock the Notifications