అమరావతి రైతుల పాదయాత్ర స్పందన చూసి జగన్ కు చలి జ్వరం.. అందుకే అడ్డుకునే కుట్రన్న అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగాలని రైతులు నిర్వహిస్తున్న మహాపాదయాత్రపై వైసీపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారు. మహాపాదయాత్ర రాజకీయ యాత్ర కాదని భావితరాల భవిష్యత్ యాత్ర అని పేర్కొన్న అచ్చెన్నాయుడు వైసీపీ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పాదయాత్రకు విశేష స్పందన .. అందుకే జగన్ కు భయం
అమరావతి రైతుల పక్షాన పాదయాత్రకు టిడిపి నేతలు సంఘీభావం ప్రకటించడమే కాకుండా వారితో కలిసి పాదయాత్ర చేస్తున్న క్రమంలో, రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్ర లో పాల్గొనడానికి వీల్లేదని పోలీసులు తేల్చి చెప్పారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడానికి వెళ్తున్న టిడిపి నేతలను హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులపై టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్ రెడ్డికి చలి జ్వరం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు.

పోలీసులను అడ్డు పెట్టుకుని పాదయాత్ర అడ్డుకునే కుట్ర
పోలీసులను అడ్డంపెట్టుకుని అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వుందని, రైతుల పాదయాత్రకు ఎన్నికల కోడ్ ను ఆపాదించి అడ్డుకునే ప్రయత్నం చేయడం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించటమే అవుతుందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అధికార దాహంతో జగన్ పాదయాత్ర చేస్తే, రాష్ట్రం కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నారని అచ్చెన్న తేల్చిచెప్పారు. జగన్ రెడ్డి చేసిన మోసానికి వైసీపీకి చెందిన రైతులు కూడా బోరుమని విలపిస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తో సహా వైసిపి నాయకులంతా ఇచ్చిన మాట తప్పినందుకు సిగ్గుతో తలదించుకోవాలి అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతిపై వైసీపీ ఆరోపణలన్నీ నిరాధారమైనవి
అమరావతి పై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైన ఆరోపణలు అని తేలిపోయిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను ఎట్లాగైనా అడ్డుకోవాలని, బ్రేక్ పడేలా చూడాలని వైసిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రైతు మహా పాదయాత్ర ను ప్రజల ముందుకు తీసుకెళుతున్న మీడియాను కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పోరాటానికి, రైతుల మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తెలిపిన అచ్చెన్నాయుడు అందుకే వైసిపి మహా పాదయాత్రతో అడ్డుకునే కుట్రలు చేస్తోందని అచ్చెన్న స్పష్టం చేశారు.
పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్ కక్ష సాధింపు ధోరణి
ఇదిలా ఉంటే వైసీపీ సర్కార్ ఎంత భయబ్రాంతులకు గురి చేసినా రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఆగదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కక్షసాధింపు ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్న ఆయన పోలీసులను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్న గొట్టిపాటి రవికుమార్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతిని చంపేద్దామని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది రైతుల ప్రజా పాదయాత్ర అని పేర్కొన్న ఆయన, పాదయాత్రను అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు. తమను గృహనిర్బంధాలకు గురి చేసినంత మాత్రాన పాదయాత్ర ఆగిపోదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications