లోకేష్ పాదయాత్ర మేనేజింగ్ ఇలా ? అచ్చెన్నాయుడి ఆడియో లీక్!ఆయన పనేనంటూ ఆర్జీవీ ట్వీట్..
నారా లోకేష్ పాదయాత్రకు జనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు ఓ టీడీపీ నేతతో మాట్లాడుతున్నట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ ఆడియో కలకలం రేపుతోంది.
ఏపీలో నారా లోకేష్ పాదయాత్రపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ టీడీపీ నేతతో మాట్లాడినట్లు భావిస్తున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఇందులో లోకేష్ పాదయాత్రకు జనం తరలింపులు, కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయనే దానిపై వీరిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఉంది.దీన్ని టీడీపీ వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. అయితే ఇది అచ్చెన్నాయుడు కావాలనే లీక్ చేయించారంటూ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

లోకేష్ పాదయాత్ర
ఏపీలో నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర పది రోజులు దాటింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో లోకేష్ ను కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నట్లు టీడీపీ చెబుతోంది. దీనికి సంబంధించి పలు ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తోంది. అయితే ఈ జనం, వాహనాలకు సంబంధించిన సంచలన విషయాలతో ఓ ఆడియో సర్కులేట్ అవుతోంది.
అచ్చెన్నాయుడి ఆడియో చాట్ ?
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కో ఆర్డినేటర్ చిట్టిబాబునాయుడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఇందులో చిట్టిబాబు నాయుడు అచ్చెన్నాయుడితో లోకేష్ పాదయాత్రకు సంబంధించి తాను చేస్తున్న ఏర్పాట్లను పంచుకున్నారు. తాను ఈ యాత్రకు జనాన్ని ఎలా తరలిస్తోందీ, వాహనాలు ఎలా సమకూరుస్తోందీ, డబ్బులు ఎలా పంచుతోందీ వివరించారు. దీంతో ఆయన చెబుతున్న మాటల్ని విన్న అచ్చెన్నాయుడు పలు సూచనలు కూడా చేస్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆడియో సోషల్ మీడియాలో టీడీపీ ప్రత్యర్ధులు వైరల్ చేస్తున్నారు.

అచ్చెన్నాయుడే లీక్ చేశారంటూ ఆర్జీవీ ట్వీట్ !
అయితే ఈ ఆడియో లీక్ పై టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ మధ్య వైసీపీతో అంటకాగుతున్న వర్మ.. అచ్చెన్నాయుడు ఆడియో లీక్ పై ట్వీట్ చేశారు. ఇందులో ఈ ఆడియో లీక్ చేసింది 100 శాతం అచ్చెన్నాయుడే అని ఆరోపించారు. ఇప్పటికైనా లోకేష్ కెపాసిటీ చంద్రబాబు తెలుసుకునేలా చేసి టీడీపీని కాపాడాలని అచ్చెన్నాయుడు పన్నిన వ్యూహమే ఇది అంటూ ట్వీట్ లో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్జీవీ ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications