సాయం చేస్తానని ఏటిఎంల చోరీ: దొంగ అరెస్ట్(ఫొటో)
విశాఖపట్నం: ఏటిఎం సెంటర్ల వద్ద మాటువేసి నిరక్షరాస్యులు, వృద్ధులను మోసం చేసి వారి ఖాతాలోని సొమ్మును కాజేస్తున్న ఓ వ్యక్తిని పెందుర్తి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 90వేలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీస్ కమిషనరేట్‌లో క్రైం ఏడిసిపి ఎస్ వరద రాజు మీడియాకు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
కె కోటపాడు మండలం పైడంపేటకు చెందిన ములపర్తి అర్జునరావు చెడు స్నేహాలు, వ్యసనాలకు బానిసయ్యాడు. ఓసారి ఏటిఎం వద్ద డబ్బులు తీయడంలో వృద్ధుడికి సాయం చేసిన అర్జునరావు తన వద్ద ఉన్న ఏటిఎంను అతనికిచ్చాడు. ఆ తర్వాత వృద్ధుని ఏటిఎంలోని మొత్తం సొమ్మును వేరే ఏటిఎం నుంచి డ్రా చేసుకున్నాడు.

అప్పటి నుంచి అతడు ఏటిఎంల వద్ద కాపలా కాయడం, నిరక్షరాస్యులు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటించి వారి ఏటిఎంల పిన్ నెంబర్ తెలుసుకుని సొమ్మును దొంగలించేవాడు. మొదట దొంగిలించిన ఏటిఎంలను వారికిచ్చి వారి వద్ద ఉన్న ఏటిఎంను తీసుకుని డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఈ విధంగా కంచరపాలెం, పెందుర్తి ప్రాంతాల్లో ఐదు దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తం రూ. 1,06, 600 కాజేశాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఏటిఎంలలోని సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు దొంగ కోసం దర్యాప్తు చేపట్టారు. పెందుర్తి సిఐ ఎస్ ఆదాము, ఎస్ఐ రామకృష్ణ తమ సిబ్బందితో బుధవారం ఉదయం ఎస్‌బిఐ ఏటిఎం వద్ద మాటువేసి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 90వేలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications