ప్రేమికులపై దాడి, యువకుడు మృతి: తల్లీకూతుళ్ల హత్య మిస్టరీ
గుంటూరు/ కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కోటప్పకొండ ఘాట్ రోడ్‌లో ప్రేమికుల జంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రియుడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రియురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంజీనాయక్, స్వాతి అనే ప్రేమజంట బుధవారం కోటప్ప కొండకు ఘాట్ రోడ్‌లో వెళుతుండగా వారిపై దుండగులు దాడి చేశారు.
ఈ ఘటనలో విద్యార్థి అంజీనాయక్ మృతి చెందగా స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో నరసాపేటలోని ఆస్పత్రికి తరలించారు. యువతి వంటిపై గాయాలు, బట్టలు చినిగి ఉండడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు స్పృహ వస్తే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

మృతుడి స్వస్థలం మాచర్ల మండలం, శ్రీరాంపురం తండా కాగా, నరసాపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. యువతి స్వగ్రామం ప్రకాశంజిల్లా, యర్రగొండపాలెం. చిలకలూరిపేటలోని ఓ కాలేజీలో చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం మండలం వేమవరంలో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పరువు కోసమే ఇద్దరినీ హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఇ.వేమవరంలో నివాసముంటున్న ధనలక్ష్మి అనే యువతి దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది అంగీకరించని ధనలక్ష్మి సోదరుడు శ్రీనివాస్ ఆమెను తన స్నేహితులతో కలిసి ఈనెల 4న హత్య చేశాడు.
ధనలక్ష్మి పెళ్లికి సహకరించిందని తల్లి దుర్గమ్మను కూడా చంపేశాడు. ఆ తర్వాత వారు ఉరివేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications