గుప్పెడు దోరగా వేయించిన శెనగలు తీసుకుంటే చాలు- ఎన్నెన్నో.. !!
ఆధునిక జీవనశైలిలో బరువు తగ్గాలన్నా, కండరాల పుష్టిని పెంచుకోవాలన్నా సరైన ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం. ఇలాంటి సమయంలో జంక్ ఫుడ్‌కు బదులుగా మన సాంప్రదాయ ఆహారాలను ఎంచుకోవడం ఎంతో మేలు. మన ఇళ్లలో సాధారణంగా లభించే వేయించిన శనగలు (పుట్నాలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే స్నాక్‌గా ఉపయోగపడతాయి. తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఈ దేశీ స్నాక్ ప్రతి ఒక్కరి డైట్‌లో భాగం చేసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో దొరికే రకరకాల ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్ల కంటే సహజ సిద్ధంగా లభించే వేయించిన శనగలే ఎంతో ఉత్తమమైనవని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. శాఖాహారులకు ప్రోటీన్ కొరతను తీర్చడానికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. ఎప్పుడు ఆకలి వేసినా చిరుతిండిగా కూడా దీనిని తీసుకోవచ్చు.

వేయించిన శనగలలో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ప్రోటీన్లు.. కండరాల పెరుగుదలకు, దెబ్బతిన్న కణాల మరమ్మతుకు సహాయపడతాయి. వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగుతుంది. పదే పదే తినాలనే భావన తగ్గుతుంది. ఫలితంగా బరువును కూడా నియంత్రించుకున్నట్టవుతుంది దీనివల్ల.
మధుమేహం ఉన్నవారికి కూడా వేయించిన శనగలు ఓ అద్భుతమైన స్నాక్ గా ఉపయోగపడతాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచకుండా నిదానంగా శక్తిని విడుదల చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం కొలెస్ట్రాల్ శాతం తగ్గించడంలో తోడ్పడుతాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బుల ముప్పు నుండి కాపాడతాయి.
ఈ సూపర్ ఫుడ్‌లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను దృఢంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఐరన్, విటమిన్ బీ6 వంటి ముఖ్యమైన పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీర క్రియాశీలతను పెంచుతాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాల నష్టాన్ని నివారించి, దీర్ఘకాలిక శారీరక వాపుల నుండి రక్షణ కల్పిస్తాయి.
వేయించిన శనగలను సులభంగా విభిన్న పద్ధతుల్లో ఆహారంలో ఒక భాగం చేసుకోవచ్చు. కొద్దిగా నూనె, కారం కలిపి వేయించి స్పైసీ స్నాక్‌గా తినవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, నిమ్మరసం కలిపి ఒక రుచికరమైన చాట్‌గా తయారుచేసి సాయంత్రం వేళల్లో ఆస్వాదించవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఖరీదైన ఆహారాలు కాకుండా, అందుబాటు ధరలో అత్యంత సులభంగా లభించే ఇలాంటి సాంప్రదాయ స్నాక్స్‌ను ఎంచుకోవడం ఎంతో అవసరం. ప్రతి రోజూ గుప్పెడు వేయించిన శనగలను క్రమ తప్పకుండా తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను సహజ పద్ధతిలోనే అందిస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications