22ఏ భూములపై ఏపీ సర్కార్ కొత్త జీవో- తాజా మార్పులివే-మంత్రి వెల్లడి..!
ఏపీలో వివాదాస్పదంగా మారిన సెక్షన్ 22-Aపై కొత్త జీవో విడుదల చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ప్రకటించారు. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్, సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా 22-A జీవో రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. 2007లో తీసుకొచ్చిన 22-A విధానంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో 22-Aపై ఇచ్చిన సర్క్యులర్లను రద్దు చేస్తూ ప్రభుత్వం (AP Govt) కొత్త మార్గదర్శకాలు ఇస్తున్నట్లు తెలిపారు. 22-Aలో భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తున్నామని రెవెన్యూ మంత్రి వెల్లడించారు.
కొత్తగా 22-A జాబితాలో భూమిని చేర్చాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. నిషేధిత ఆస్తుల కోసం ఒకే సెంట్రలైజ్డ్, అధికారిక డేటాబేస్ నిర్వహిస్తామని, వ్యవసాయ భూములకు వెబ్‌ల్యాండ్ 2.0 డేటానే ప్రామాణికమని ఆయన తెలిపారు. 22-A విషయంలో మ్యాన్యువల్ ఎంట్రీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం వెబ్‌ల్యాండ్ 2.0 డేటాను IGRS డేటాబేస్‌తో సింక్రనైజ్ చేస్తామని వెల్లడించారు. నిషేధిత ఆస్తుల వివరాలను ఓపెన్ డొమైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అనగాని తెలిపారు. గ్రామకంఠం భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ 22-A జాబితాలో ఉండకూడదన్నారు. పట్టా భూములను అనవసరంగా 22-Aలో చేర్చితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

చట్టబద్ధంగా క్రమబద్ధీకరించిన యూఎల్సీ భూములను 22-A నుంచి తొలగించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. APSFC వేలంలో కొనుగోలు చేసిన భూములను అర్హత మేరకు 22-A నుంచి తొలగిస్తామని తెలిపారు. బ్యాంకుల వద్ద తనఖాలో ఉండి గతంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న అలాంటి భూములను 22-A నుంచి తొలగించేలా కొత్త జీవోలో మార్గదర్శకాలు ఉంటాయన్నారు. పట్టణాల్లోని పాత లేఅవుట్ల భూముల సమస్యలకు పరిష్కారం చేస్తామన్నారు. చట్టబద్ధమైన వేలంలో కొనుగోలు చేసిన దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఇనాం భూములు 22-Aలో ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22-Aలో పెడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నిషేధిత ఆస్తుల జాబితాలో భూమిని చేర్చడం లేదా తొలగించే అధికారం RDO లేదా సబ్ కలెక్టర్‌కు ఇస్తామన్నారు. ఆర్డీవో, సబ్ కలెక్టర్ ఉత్తర్వులపై జాయింట్ కలెక్టర్ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారన్నారు. జేసీ ఉత్తర్వులపై ప్రభుత్వానికి రివిజన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కోర్టు ఆదేశాలు వచ్చిన నిషేధిత ఆస్తుల విషయంలో ఐదు రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్, సంబంధిత రెవెన్యూ అధికారులు ఐదు రోజుల్లో కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. కొత్త సాఫ్ట్‌వేర్ 90 రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు.22-A ఉత్తర్వులు మాత్రం వెంటనే అమల్లోకి వస్తాయన్నారు.

భూమిని 22-Aలో చేర్చే ముందు యజమానికి తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని, నోటీసు ఇచ్చి విచారణ జరిపిన తర్వాతే 22-Aలో చేర్చడంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. భూమి ప్రభుత్వానిదని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే అన్నారు.
తమ భూమి ప్రభుత్వ భూమి కాదని నిరూపించుకోవాల్సిన భారం యజమానులపై ఉండదన్నారు. భూమి యజమానికి రిజిస్టర్డ్ పోస్టు, డిజిటల్ విధానం ద్వారా నోటీసులు పంపాలన్నారు. అవసరమైతే భూ యజమాని ఇంటి వద్ద లేదా పంచాయతీ కార్యాలయంలోనూ నోటీసు ప్రదర్శించాలన్నారు. పౌరులకు తమ వాదనలు, ఆధారాలు సమర్పించేందుకు తగిన గడువు కల్పిస్తామన్నారు. విచారణ అనంతరం సంబంధిత అధికారి తప్పనిసరిగా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలన్నారు. తప్పుగా నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications