దీక్ష విరమణ, విద్యార్ధుల నిరసనలకు బ్రేక్ - కేంద్రానికి సోనమ్ వాంగ్ చుక్ కండిషన్లు..!
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో తాను ప్రారంభించిన దీక్షను విరమించేది లేదని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) ఇవాళ మరోసారి తేల్చిచెప్పేశారు. అయితే విద్యార్దులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, నీట్ వివాదంపై తగిన విధంగా స్పందిస్తామని హామీ ఇస్తే విద్యార్ధులతో ఆందోళనలు విరమింపజేసేందుకు సిద్దమని సోనమ్ తలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కు ఆయన ఓ లేఖ రాశారు.
విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు లేదా చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తాను దీక్షను విరమిస్తానని లేఖలో సోనమ్ వాంగ్ చుక్ తెలిపారు.అలాగే కేంద్ర ప్రభుత్వం తమతో జరిపిన చర్చల్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం, అలాగే పార్లమెంట్‌లో బాధ్యత నిర్ధారణపై అర్థవంతమైన చర్చ, అవసరమైతే విద్యాశాఖ మంత్రిపై చర్యల అంశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

జూలై 20న జరిగిన పార్లమెంట్ ర్యాలీ శాంతియుతంగా జరిగినప్పటికీ, పోలీసులు భారీ బలప్రయోగం చేశారని సోనమ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి వేధింపులు లేదా ప్రతీకార చర్యలు ఉండకూడదని కోరారు. తనను ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 65 మంది ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా, యువత భవిష్యత్తు కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోనని వాంగ్‌చుక్ తెలిపారు. కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను గౌరవించి, పారదర్శకంగా వ్యవహరించి, వారి విశ్వాసాన్ని నిలబెట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ భవిష్యత్తు యువత ప్రభుత్వ వ్యవస్థలపై ఉంచే నమ్మకంపైనే ఆధారపడి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications