జూరాలకు జలకళ- సీఎం డీకే శివకుమార్ చొరవతో
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఎండిపోతున్న సాగు పంటలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. దీనికోసం కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుండి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అయిదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. నీటి విడుదలకు అంగీకరించారు. దీనికోసం రేవంత్ రెడ్డి స్వయంగా డీకే శివకుమార్ కు ఫోన్ చేశారు.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు అనుకూలించట్లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువులు, కుంటలలో నీటి మట్టాలు గణనీయంగా అడుగంటాయి. పచ్చని పైర్లు కళ్లముందే ఎండిపోతున్నాయి. చేతికి అందిన పంటను రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న నీళ్లు చాలట్లేదు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక నారాయణపూర్ జలాశయంపై ఆధారపడటం మినహా తెలంగాణ ముందు ఇతరత్రా మార్గాలు లేకుండా పోయాయి.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. డీకే శివకుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. అయిదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. నీటి విడుదలకు చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నీటి విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, అధికారికంగా ఓ వినతి పత్రాన్ని అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని బెంగళూరుకు పంపింది.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టీ మేఘారెడ్డి, జీ మధుసూదన్ రెడ్డి ఉన్నారు. బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు వారంతా. జూరాల ప్రాజెక్టు పరిధిలోని పంటలను రక్షించేందుకు వీలుగా విడతలవారీగా అయిదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
అంతకుముందు సచివాలయంలో రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. నారాయణపూర్ నుండి విడుదల చేసే నీరు జూరాలకు చేరడానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో తక్షణమే నీటిని విడుదల చేసేలా కోరాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి సూచించారు. 2019లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన మేరకు కర్ణాటక ప్రభుత్వం జూరాలకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications
