పార్లమెంట్ లో నీట్ పేపర్ లీకేజీ మంటలు.. ఉభయ సభలలో రచ్చ రచ్చ!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాల మధ్య మొదలయ్యాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్‌సభ, రాజ్యసభ రెండింటి లోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం సభలో రచ్చకు కారణమైంది.
లోక్ సభలో మరణించిన మాజీ సభ్యులకు నివాళులు
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే, ఇటీవల కన్నుమూసిన ఆరుగురు మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్-ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీకి కూడా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులు అర్పించారు.

నీట్ పరీక్ష లీజేకీ అంశంతో మొదలైన రగడ .. లోక్ సభ మధ్యాహ్నానికి వాయిదా
ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ, ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
రాజ్యసభలోనూ సీన్ రిపీట్
మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ ఛైర్మన్ సి. పి. రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ సీన్ రిపీట్ అయింది.
వర్షాలు, పార్లమెంట్ సమావేశాలు చురుగ్గా ఉండాలని ఆకాక్షించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు, పార్లమెంట్ సమావేశాలు.. రెండు కూడా చురుగ్గా, ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వకారణమని చెప్పారు.












Click it and Unblock the Notifications